'బ్రస్సెల్స్ బాంబు పేలుళ్లకు మాదే బాధ్యత'
బ్రెస్సెల్స్: బెల్జియం రాజధానిలో బ్రస్సెల్స్లో బాంబు పేలుళ్ల ఘటనకు తమదే బాధ్యతని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. మంగళవారం బ్రస్సెల్స్లోని జావెంటమ్ ఎయిర్ పోర్ట్ టర్మినల్ బిల్డింగ్ వద్ద రెండు చోట్ల, పక్కనే రైల్వే స్టేషన్ సమీపంలో మరో పేలుడు సంభవించాయి. ఈ ఘటనలో కనీసం 30 మంది మరణించగా, మరో 35 మంది గాయపడ్డారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది, ప్యారిస్ లో బాంబుదాడులకు పాల్పడిన సలాహ్ అబ్దెస్లామ్ను అరెస్టు చేసిన నాలుగు రోజుల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
బాంబు పేలుళ్ల ఘటన అనంతరం తాత్కాలికంగా విమానాశ్రయాన్ని మూసివేశారు. నగరంలో హై అలెర్ట్ ప్రకటించారు. పోలీసులు నగరంలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. అనుమానితులను అరెస్ట్ చేశారు. బెల్జియం, ఫ్రాన్స్ సరిహద్దును మూసివేసి ఉగ్రవాదుల కోసం భద్రత బలగాలు వేటాడుతున్నాయి.