బాగ్దాది కథ ముగిసింది
బాగ్దాద్: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్‌ఐఎస్) నాయకుడు అబూబకర్ అల్ బాగ్దాది ప్రాణాలతో లేరని ఉగ్రవాద సంస్థ మంగళవారం ప్రకటించింది. దీంతో బాగ్దాదీ చనిపోయాడంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించినట్లయింది. త్వరలోనే ఆయన వారసుడిని ఎన్నుకుంటామని తెలిపింది. మోసుల్‌లోని తల్ అఫార్ పట్టణంలోని ఐఎస్‌ఐఎస్ తన సొంత మీడియా ద్వారా సంక్షిప్తంగా ఈ ప్రకటన చేసింది.
బాగ్దాదీ చనిపోయాడని పేర్కొన్న సంస్థ.. ఎలా చనిపోయాడు? తదితర వివరాలను మాత్రం వెల్లడించలేదని ఇరాక్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఇస్లామిక్ స్టేట్ చెర నుంచి మోసుల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ఇరాక్ ప్రధాని హైదర్ అల్-అబాదీ ప్రకటించిన మరునాడే ఐఎస్ఐఎస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. దాదాపు ఎనిమిది నెలలుగా ఐఎస్ చేతుల్లో ఉన్న మోసుల్‌ను భీకర పోరు తర్వాత ఇరాక్ సేనలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి.