మహిళా జర్నలిస్టును చంపేసిన ఐఎస్ఐఎస్
సిరియాలోని రక్కా ప్రాంతంలో పౌర జర్నలిస్టుగా పనిచేస్తూ.. స్థానిక విషయాలను ప్రపంచానికి వెల్లడిస్తున్న ఓ మహిళను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపు అమానుషంగా ఉరి తీసింది. ఐఎస్ఐఎస్ చంపేసిన తొలి మహిళ ఆమెనని సిరియా మీడియా తెలిపింది. రుఖియా హసన్ మరణంతో గత అక్టోబర్ నుంచి ఐఎస్ఐఎస్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన విలేకరుల సంఖ్య ఐదుకు చేరిందని సిరియన్ జర్నలిస్టు సంస్థ 'సిరియా డైరెక్ట్' తెలిపింది.
ఇస్లామిక్ స్టేట్ అండ్ లెవాంట్ అధీనంలో ఉన్న రక్కా ప్రాంతంలో మానవ దైనందిన జీవితం గురించి రుఖియా హసన్ నిసాన్ ఇబ్రహీం పేరుతో ఫేస్‌బుక్‌లో నిత్యం వార్తలు అందించేది. స్వతంత్ర జర్నలిస్టుగా పనిచేస్తున్న ఆమెను ఉరితీయడాన్ని సిరియా మానవ హక్కుల సంస్థ (ఆర్బీఎస్ఎస్) ధ్రువీకరించింది. 'నేను రక్కాలో ఉన్నాను. నన్ను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. ఐఎస్ఐఎస్ నన్ను అరెస్టుచేసి చేసి చంపేయవచ్చు. అయినా ఫర్వాలేదు. ఐఎస్ఐఎస్ అవమానాల మధ్య జీవించడం కంటే హుందాగా చనిపోవడం మేలు' అని ఆమె చివరి వ్యాక్యాలను ఆర్బీఎస్‌ఎస్ స్థాపకుడు అబు మహమ్మద్ శనివారం ట్విట్టర్‌లో వెల్లడించారు.
రఖ్కా నగరంలో వై-ఫై హాట్‌స్పాట్‌లను ఐఎస్ఐఎస్ నిషేధించడాన్ని తన చివరి ఫేస్‌బుక్ పోస్టులో హసన్ తీవ్రంగా తప్పుబట్టింది. వై-ఫై, ఇంటర్నెట్ సేవలను ఇస్లామిక్ స్టేట్ నిలిపివేసినా.. తమ సందేశాలను మోసుకెళ్లే పావురాళ్లను ఏమీ చేయలేదని పేర్కొన్నారు. హసన్ గత ఏడాది జూలై 21 నుంచి కనిపించడం లేదు. గూఢచర్యం ఆరోపణలపై ఆమెను ఉరితీసినట్టు మూడురోజుల కిందట హసన్ కుటుంబసభ్యులకు ఐఎస్ఐఎస్ సమాచారం ఇచ్చినట్టు తెలిసింది.