'అమెరికా దాడులతో జీతాలు సగానికి కోసేశారు'
అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాల వరుస దాడులతో అతలాకుతలమవుతున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ సిరియాలో తన ఫైటర్ల జీతాలను అమాంతం కోత పెట్టింది. ప్రస్తుతం నెలకొన్న అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో ముజాహిద్దీన్ల జీతాలను 50శాతం వరకు తగ్గించింది.
ఆపరేషన్ 'టైడల్ వేవ్ 2' పేరిట అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు సిరియాలోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా ఐఎస్ఐఎస్ చమురు బావులు, చమురు సరఫరా లైన్లు, నగదు దుకాణాలు లక్ష్యంగా దాని ఆర్థిక వనరులను దెబ్బతీయడమే ధ్యేయంగా ఈ దాడులు జరుపుతున్నాయి. వ్యూహాత్మకంగా కొనసాగుతున్న ఈ దాడుల ప్రభావం ఐఎస్ఐఎస్ మీద గణనీయంగా ఉన్నట్టు ఆ గ్రూపు తాజాగా విడుదల చేసిన ఓ పత్రం చాటుతోంది.
'ఇస్లామిక్ స్టేట్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో ముజాహిద్దీన్లందరికీ చెల్లిస్తున్న జీతాల్ని సగానికి తగ్గిస్తున్నాం. ఎలాంటి హోదాలో ఉన్నవారికైనా ఈ నిర్ణయం నుంచి మినహాయింపు ఉండదు' అని సిరియా రఖ్కాలోని ఐఎస్ కోశాగార విభాగం 'బేత్ మాల్ అల్ ముస్లిమీన్' ఈ పత్రంలో పేర్కొంది.