ఐఎస్ అగ్రనేతపై అమెరికా బాంబులు
బాగ్దాద్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ అధికార ప్రతినిధి తీవ్రంగా గాయపడ్డాడు. ఇరాక్, అమెరికా కమాండో బలగాలు నిర్వహించిన వైమానిక దాడుల్లో అతడు పూర్తిస్థాయిలో గాయాలపాలయ్యాడు. దీంతో అతడికి రక్త స్రావం కూడా ఎక్కువగా జరగడంతో రక్తమార్పిడి చేస్తున్నట్లు సమాచారం. అబూ మహ్మద్ అల్ అద్నానీ ఇస్లామిక్ స్టేట్ లో అత్యున్నత స్థాయి హోదాను అనుభవించేవారిలో ద్వితీయ స్థానంలో ఉన్నాడు. అతడు ఇరాక్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.
ఆ సంస్థకు అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న అద్నానీ గొంతు ప్రపంచానికి సుపరిచితమే. ఎందుకంటే ఇప్పటి వరకు ఇస్లామిక్ స్టేట్ విడుదల చేసిన పలు హెచ్చరికల టేపులు, సందేశాల టేపుల్లో మాట్లాడింది అద్నానీ. తాజాగా, అతడిపై జరిగిన విషయాన్ని ఇరాక్ జాయింట్ ఆపరేషన్స్ కమాండర్ ఒకరు తెలియజేస్తూ గత నెల రోజులుగా తాము అద్నానీ కదలికలను గమనిస్తున్నామని చెప్పారు. గురువారం జరిపిన వైమానిక దాడుల్లో అతడు తీవ్రంగా గాయపడినట్లు తెలిసిందని, రక్తం కూడా చాలా పోవడంతో రక్త మార్పిడి కూడా చేస్తున్నట్లు తెలిసిందని అన్నారు. 2005లో ఒకసారి అద్నానీ అరెస్టు చేసి తీసుకెళ్లిన అమెరికా 2010లో విడుదల చేసింది. అయినా, తీరు మార్చుకోని అద్నానీ పాశ్చాత్య దేశాలకు కొరకరాని కొయ్యలా తయారయ్యాడు.