
ఐఎస్ఐఎస్ ఆయుధాలు మనవేనా..?
న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ ఉగ్రవాదులు భారతీయ కంపెనీలు తయారుచేసిన ఆయుధాలను వాడుతున్నారా? ఇండియాలో తయారయ్యి పొరుగు దేశాలకు చేరుతున్న ఆయుధాలు ఐస్ఐస్కు ఎలా చేరుతున్నాయి? ఈ విషయాలను మంగళవారం లోక్సభకు స్వతంత్ర విచారణ బృందం తెలియజేసింది. దాదాపు ఏడు భారతీయ కంపెనీలు తయారుచేస్తున్న ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్(ఐఈడీ) ఆయుధాలు ఐఎస్ఐఎస్కు చేరుతున్నట్లు తెలిపింది. ఈ అంశంపై సభలో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ హోం శాఖ సహాయమంత్రి హరీ భాయ్.. భారత్ కంపెనీ తన ఉత్పత్తులను లెబనాన్, టర్కీ దేశాలకు ఒప్పందాల మేరకే పంపుతుందని తెలిపారు.
ఐఎస్ఐఎస్కు భారత్ నుంచి నేరుగా ఎటువంటి ఆయుధాలు చేరుతున్నట్లు ఆధారాలు లేవన్నారు. యూరోపియన్ యూనియన్కు చెందిన సీఏఆర్ ఉగ్రవాద సంస్థలు, సంఘ విద్రోహశక్తులకు ఆయుధాలు ఎలా చేరుతున్నాయన్నదానిపై నిఘా వేస్తుంది. ఇందులో భాగంగానే ఇండియా నుంచి ఐఎస్ఐఎస్కు ఆయుధాలు చేరుతున్నట్లు ఆన్లైన్లో ఉంచిన డాక్యుమెంట్లలో పేర్కొంది. ఐఎస్ఐఎస్ ఉపయోగించిన 700కు పైచిలుకు ఆయుధాలను సీఏఆర్ సేకరించి ప్రపంచంలోని ఏ దేశమైన వీటిని ఉపయోగిస్తుందా? అనే అంశంపై రెండేళ్ల పాటు సాగిన పరిశోధనలో అవి ఇండియాలోని ఏడు కంపెనీలు తయారుచేసినవి అని తేలింది.