
హిల్లరీ కోసం కాదు.. ట్రంప్‌కు వ్యతిరేకంగానే..!
అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలనే అంశంపై క్లేవ్‌లాండ్‌లో నివసిస్తున్న ఇండో అమెరికన్లు డైలమాలో ఉన్నారు.
క్లేవ్‌లాండ్/న్యూయార్క్: అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలనే అంశంపై క్లేవ్‌లాండ్‌లో నివసిస్తున్న ఇండో అమెరికన్లు డైలమాలో ఉన్నారు. అయితే చాలా మంది మాత్రం హిల్లరీ క్లింటన్‌కే ఓటేస్తామని, మహిళలు, వలసల అంశంపై డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు గురి చేస్తున్నాయని పేర్కొంటున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, ఉగ్రవాదం, వలసలు తదితర అంశాలపై ట్రంప్ విజన్ వారి హృదయాలను తాకాయి. హిల్లరీ క్లింటన్‌కు ఓటేసి మరోమారు ఒబామా తరహా పాలన కావాలని వారు భావించలేదు. అయితే ట్రంప్ తాజా వివాదాలు వారిని భయాందోళనకు గురిచేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ట్రంప్‌కు వ్యతిరేకంగానే హిల్లరీకి ఓటేయాలని అనుకుంటున్నామని, హిల్లరీ అధ్యక్షురాలు కావాలన్న ఆకాంక్షతో మాత్రం కాదని చాలా మంది చెబుతున్నారు. మరోవైపు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తీసుకునే చెడు నిర్ణయాలను ఇకపై భరించే స్థితిలో లేరని ప్రముఖ న్యాయవాది, ‘ఇండియన్–అమెరికన్స్ ఫర్ ట్రంప్–2016’ ఉపాధ్యక్షుడు ఆనంద్ అహూజా అన్నారు. ‘వలసదారుల వ్యతిరేకిగా ట్రంప్‌ను చిత్రీకరిస్తున్నారు. ట్రంప్ అక్రమ వలసదారులకు మాత్రమే వ్యతిరేకి. చట్టబద్ధంగా వలస వచ్చే వారికి, వస్తున్న వారికి వ్యతిరేకి కాదు’ అని స్పష్టం చేశారు.