జాకీచాన్
బీజింగ్: తన కొడుకు జేసీ చాన్ చేసినపనికి తాను సిగ్గుపడుతున్నట్లు హాలీవుడ్ సూపర్ స్టార్, యాక్షన్ హీరో జాకీచాన్ చెప్పారు. అయితే అతన్ని కాపాడేందుకు తాను తన రాజకీయ పలుకుబడిని వాడుకోననని ఆయన చెప్పారు. తన కొడుకు ఏదో ఒకరోజు తనలాగే డ్రగ్స్ వ్యతిరేక ప్రచారకర్త అవుతాడన్న ఆశాభావాన్ని జాకీచాన్ వ్యక్తం చేశారు.
గాయకుడు, నటుడు జేసీ చాన్(32)ను మత్తుపదార్థాల కేసులో ఈ నెల 6న బహిరంగంగా విచారించనున్నట్లు బీజింగ్‌లోని ఓ కోర్టు మంగళవారం ప్రకటించింది. మత్తుపదార్ధాల నేరాలకు సంబంధించి జేసీచాన్, తైవాన్ సినీ నటుడు కో చెంగ్ తుంగ్, మరి కొంతమందిని బీజింగ్ పోలీసులు గత ఏడాది ఆగస్ట్ 14న అరెస్ట్ చేశారు. జేసీ, కోలు తాము మరిజువానా వాడినట్లు అంగీకరించారు. చైనాలో ఇలాంటి నేరాలకు శిక్షలు కఠినంగా ఉంటాయి. మాదకద్రవ్యాలు వాడేవారికి గట్టి హచ్చరిక ఇచ్చేందుకు ఈ కేసులో వీరిని బహిరంగంగా విచారణ చేయనున్నారు.
ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సినీ ప్రస్థానం ఆరంభించిన జాకీచాన్ ఆ తరువాత అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. ఆక్రోబాటిక్ ఫైటింగ్ స్టయిల్, సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కు, వినూత్న స్టంట్స్‌కు మారుపేరు అయిన జాకీచాన్ వంద సినిమాలలో నటించారు. చాన్ పేరు చెబితే చాలు మార్షల్ ఆర్ట్స్ అభిమానులు పులకరించిపోతారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాకీచాన్ గతంలో చైనాలో ప్రచారం నిర్వహించారు. అటువంటి చాన్ కొడుకు చేసిన పనికి సిగ్గుతో తలదించుకోవలసి వచ్చింది. తన కుమారుడు చేసిన తప్పుకు అప్పట్లో చాన్ క్షమాపణలు కూడా చెప్పారు.