![Japan Airlines Pilot Arrested In London Just Before Take Off The Flight - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/2/japan-airlines.jpg.webp?itok=QeMJn8yO)
ప్రతీకాత్మక చిత్రం
లండన్ : లండన్ ఎయిర్‌పోర్టులో గురువారం కలకలం రేగింది. ఆల్కాహాల్ సేవించాడంటూ జపాన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమాన పైలట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఫ్లైట్ టేకాఫ్‌కు కొద్ది నిముషాల ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం అలజడి సష్టించింది. కఠిన నియమాలు, నిబంధనలకు పెట్టింది పేరైన జపాన్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. ఇకపై ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు చేపడతామనీ, పైలట్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపింది.
వివరాలు.. బోయింగ్ 777 విమానం (ఫ్లైట్ నెంబర్ జేఎల్ 44) గురువారం ఉదయం 244 మంది ప్రయాణికులతో లండన్ నుంచి టోక్యో బయలుదేరాల్సి ఉంది. అయితే, విమాన పైలట్ కత్సుతోషి జిత్సుక్వా (42) శరీరంలో ఆల్కాహాల్ శాతం మోతాదుకు మించి ఉందని ఎయిర్‌పోర్టు అధికారులు గుర్తించారు. జిత్సుక్వా గత రాత్రి అతిగా మద్యం సేవించడంతో అతని శరీరంలో ఆల్కాహాల్ శాతం పరిమితికి ఉందని తెలిపారు. పైలట్‌ను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నామని ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది వెల్లడించారు. నిబంధనల ప్రకారం పైలట్ శరీరంలో 100 మిల్లీ లీటర్ల రక్తానికి 80 మిల్లీ గ్రాముల ఆల్కాహాల్ వరకు ఉండొచ్చు. కానీ, జిత్సుక్వా శరీరంలో అది 189 మిల్లీ గ్రాములుగా నమోదైందని పేర్కొన్నారు. నిందితున్ని నవంబర్ 29 న కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. కాగా, ఈ ఉదంతంతో విమానం గంటపాటు నిలిచిపోయింది. అనంతరం మిగతా ఇద్దరు పైలట్లతో టోక్యోకు బయలు దేరింది.
Comments
Please login to add a commentAdd a comment