జపాన్ ప్రధానిగా మళ్లీ అబే
టోక్యో: జపాన్ ప్రధానిగా షింజో అబే మరోసారి ఎన్నికయ్యారు. అబే చేపట్టిన ఆర్థిక విధానాలకు రిఫరెండంగా భావించిన మధ్యంతర ఎన్నికల్లో ఓటింగ్ శాతం బాగా తగ్గింది. అయినాసరే ఈ ఎన్నికల్లో అబే సునాయాసంగా విజయం సాధించారు. ఓటింగ్ ముగిసిన అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో అబే నేతృత్వంలోని లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ(ఎల్‌డీపీ), దాని మిత్రపక్షం కొమిటో కలసి పార్లమెంట్ దిగువ సభలో మూడింట రెండొంతుల మెజారిటీ సాధిస్తాయని వెల్లడైంది.
టీవీ అసాహీ పార్లమెంట్‌లోని 475 సీట్లకుగానూ ఈ కూటమి 333 సీట్లలో విజయం సాధిస్తుందంది. టీబీఎస్ ఎల్‌డీపీ కూటమి 328 స్థానాలు సాధిస్తుందని చెపితే.. నిక్కే న్యూస్ పేపర్ ఎల్‌డీపీ ఒంటరిగానే 290 నుంచి 310 స్థానాలు సాధిస్తుందని తెలిపింది. కాగా, ఓటింగ్ శాతం బాగా తక్కువగా ఉన్నా ప్రధాని అబే ఘనవిజయం సాధిస్తారని తాను భావిస్తున్నట్టువసేడా వర్సిటీ ప్రొఫెసర్ మసారు కోహ్నో పేర్కొన్నారు. షింజో అబేకి ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల కూడా ఓటింగ్ శాతం తగ్గడానికి కారణమని అన్నారు.