జపాన్ ఈశాన్య ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన సునామీ సంభవించి నేటికి ఐదేళ్లు.
టోక్యో: జపాన్ ఈశాన్య ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన సునామీ సంభవించి నేటికి ఐదేళ్లు. పసిఫిక్ మహా సముద్రంలో 2011 మార్చ్ 11న రిక్టర్ స్కేలుపై 9 పాయింట్లుగా నమోదైన భూకంపం దాటికి ఎగసిపడిన రాకసి అలల దాటికి అధికారిక లెక్కల ప్రకారమే మృతి చెందిన, అదృశ్యమైనవారి సంఖ్య 18,500 గా నమోదైంది. సునామీ దాటికి ఫుకుషిమాలోని అణువిద్యుత్ కేంద్రం ధ్వంసమై వెలువడిన రేడియేషన్ ప్రభావంతో ఆ ప్రాంతమంతా నివాసానికి అయోగ్యంగా మారిపోయింది. అక్కడి ప్రజలు ప్రాణాలను చేతబట్టుకొని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు.
ఈ విషాద ఘటనకు ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం జపాన్ ప్రభుత్వం అధికారిక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. విపత్తులో మృతి చెందిన ప్రజలకు ప్రధాని షింజో అబే నివాళులర్పిస్తున్నారు. సరిగ్గా ఆనాడు భూకంపం సంభవించిన సమయంలో ఆయన ఒక నిమిషం పాటు మౌనం పాటించి సంతాపం తెలపనున్నారు. ఫుకుషిమా ప్రాంతాన్ని మళ్లీ నివాసయోగ్యంగా మార్చడానికి ప్రభుత్వం ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంది. ఈ ఘటనతో అణురియాక్టర్లపై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావడంతో జపాన్ ఇతర ఇంధన మార్గాలపై దృష్టి సారించింది.