టోక్యో: అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన జపాన్ దేశం జనాభా విషయంలో మాత్రం వెనకబడుతోంది. 2019 ఏడాదిలో మరోసారి అత్యంత కనిష్ట జననాల రేటును నమోదు చేసింది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో తక్కువ జననాల రేటు నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రభుత్వ లెక్కల ప్రకారం 2019 లో దేశంలో జన్మించిన శిశువుల సంఖ్య 8లక్షల 64వేలకు పడిపోయింది. 1899లో నివేదికలు గణించడం ప్రారంభమైనప్పటి నుంచి అతి తక్కువ అని ఆరోగ్య, కార్మిక, సంక్షేమ మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ నివేదిక తెలిపింది. ముఖ్యంగా నవజాత శిశువుల సంఖ్య 2018 నుంచి 54 వేలకు పడిపోయిందని నివేదిక అంచనా వేసింది. 2019లో మరణాల సంఖ్య 1.376 మిలియన్లకు చేరుకుందని తెలిపింది.
జపాన్‌లో సంతానోత్పత్తి రేటు తగ్గడం, వృద్ధుల శాతం పెరగడం పట్ల ఆ దేశ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. జనన శాతం తగ్గుదల ఇలాగే కొనసాగితే 2060 నాటికి జపాన్ జనాభా మూడో వంతు పడిపోతుందని ఆ దేశ సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా తగ్గుతున్న ఏకైక దేశం జపాన్ కావడం గమనార్హం. జపాన్ దేశ జనాభాలో వృద్ధులు అధికం. 20శాతం ప్రజలు 65ఏళ్లకు పైబడిన వారేనని తెలిపింది. సంతానోత్పత్తి సమస్యలు కేవలం జపాన్ దేశానికే కాక జర్మనీ, యుఎస్, యుకే, సింగపూర్, ఫ్రాన్స్ దేశాలు 2030 సంవత్సారానికి సంతానలేమి సమస్యలు ఎదుర్కోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జననాల సంఖ్యను పెంచడానికి దక్షిణ కొరియా ప్రభుత్వం ఉద్యోగుల పని గంటలను వారానికి 68 గంటల నుంచి 52 గంటలకు తగ్గించింది. సంతానోత్పత్తి రేటు తగ్గడం ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగిస్తుందని నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment