మిచిగాన్‌కు చెందిన యూదు దంపతులకు అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో చేదు అనుభవం ఎదురైంది. శరీరం నుంచి దుర్వాసన వస్తోందన్న కారణంగా 19 నెలల చిన్నారితో సహా ఆ దంపతులను అత్యవసరంగా విమానం నుంచి దించేశారు. బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాలు.. మిచిగాన్‌కు చెందిన యోసి ఆడ్లర్ అనే వ్యక్తి భార్య, తన చిన్నారితో కలిసి హాలిడే ట్రిప్ కోసం మియామీ వచ్చాడు. ట్రిప్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలో బుధవారం విమానం ఎక్కిన కొద్ది సేపటి తర్వాత.. ఆడ్లర్ దంపతులు అత్యవసరంగా విమానం దిగిపోవాలంటూ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ క్రమంలో తమను దించేయడానికి గల కారణమేంటని అడగగా.. ‘మీ శరీరం నుంచి దుర్వాసన వస్తోందని ప్రయాణికులతో పాటు, మా సిబ్బంది కూడా ఫిర్యాదు చేశారు. కాబట్టి మీరు దిగిపోవాల్సిందే’ అంటూ క్రూ మెంబర్ ఇచ్చిన సమాధానం విని షాక్‌కు గురయ్యారు.
యూదులం అయిన కారణంగానే ఇలా..
తమకు జరిగిన అవమానం గురించి ఆడ్లర్ మీడియాతో మాట్లాడుతూ...‘ యూదులమనే కారణంగానే మాకు చేదు అనుభవం ఎదురైంది. మమ్మల్ని ఎందుకు దించేస్తున్నారని అడిగినపుడు..మీ మతస్తులు స్నానం చేయరు కదా.. అలాగే మంచి దుస్తులు ధరించరు అంటూ వారు ఇచ్చిన సమాధానం కలచివేసింది. నిజంగా సాటి మనుషులమనే భావన ఉంటే మంచి దుస్తులు ఇచ్చి, సువాసనలు వెదజల్లే సెంట్ ఇచ్చి ఉండవచ్చు కదా. కానీ అసలు కారణం అది కాదు. అందుకే మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా దింపేసారు. అయితే నాకు సంబంధించిన వస్తువులు మాత్రం కార్గోలో వెళ్లిపోయాయి. మరుసటి రోజు విమానం ఎక్కేవరకు హోటల్‌లో బస చేసేందుకు చాలా ఖర్చయింది. అది ఎవరు కడతారు. మాకు జరిగిన అవమానానికి ఎవరు సమాధానం చెబుతారు. ఇంటి దగ్గర నా ఎనిమిది పిల్లలు ఎదురుచూస్తూ ఉంటారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
కాగా ఈ ఘటనపై స్పందించిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ .. ‘ఆడ్లర్ శరీర దుర్వాసన వల్ల మా సిబ్బంది, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే అతడిని దింపేశాం. జాతి వివక్ష చూపలేదు. మియామీ ఎయిర్‌పోర్టులో అతడికి కావాల్సిన సదుపాయాలు కల్పించాం. అయితే మేము ఇచ్చిన వాచర్లు పనిచేయలేదని ఆడ్లర్ చెప్పాడు. ఈ విషయంపై మేము విచారణ చేశాం. ఆ తర్వాత గురువారం ఉదయం టికెట్లు బుక్ చేసి పంపించేశాం’ అని ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక.. ఈ విషయం సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో ఎయిర్‌లైన్స్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment