
డెన్వర్ ఎయిర్‌పోర్ట్‌లో త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న ప్రయాణికులు
డెన్వర్: ఏదైనా ఒక విమాన ప్రమాదం నుంచి కాస్తంతలో తప్పించుకోగానే అందులోని ప్రయాణికుల ప్రాణాలు లేచొస్తాయి. హమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకున్న కొద్దిసేపటికే మళ్లీ అదే విమానం మరో రకమైన ప్రమాదంలో పడితే ఆ ప్రయాణికుల భయాందోళనలు వర్ణనాతీతం. శుక్రవారం అమెరికాలోని డెన్వర్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అ య్యాక మంటలు చెలరేగిన విమానంలోని ప్రయాణికుల పరిస్థితి దాదాపు అలాగే ఉంది.
స్వల్పగాయాలతో బయపడిన ప్రయాణికులు ఎట్టకేలకు బతుకుజీవుడా అంటూ విమానం రెక్క పైనుంచి, అత్యవసర ఎస్కేప్ స్లైడ్ నుంచి బయటపడ్డారు. కొలర్యాడో స్పింగ్స్ నుంచి టెక్సాస్‌లోని డల్లాస్ ఫోర్ట్‌వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తున్న విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనవడం, అత్యవసరంగా డెన్వర్ ఎయిర్‌పోర్ట్‌లో దిగడం తెల్సిందే. మంటల్లో చిక్కుకున్న విమానం నుంచి సురక్షితంగా బయటపడిన మైఖేల్ ఉడ్స్ అనే మహిళ ప్రమాద ఘటనను గుర్తుచేసుకున్నారు.
‘‘కొలర్యాడో స్పింగ్స్ నుంచి బయల్దేరినప్పడు అంతా బాగానే ఉంది. కానీ మార్గమధ్యంలో విమాన ఇంజన్లలో ఒకదాని నుంచి ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. దాని తర్వాత విమానం అటూ ఇటూ ఊగడం మొదలైంది. మా పని అయిపోయిందనుకున్నాం. కానీ విమానాన్ని వెంటనే డెన్వర్‌కు తీసుకొచ్చి సురక్షితంగా ల్యాండ్ చేయడంతో హమ్మయ్య అనుకున్నా. హాయిగా ఊపిరిపీల్చుకునేలోపే విమానం క్యాబిన్‌లో దట్టమైన పొగకమ్ముకోవడం మొదలైంది.
తర్వాత మంటలు వ్యాపించాయి’’అని ఆమె చెప్పారు. ‘‘విమా నం ఆగగానే కదిలే మెట్లను తీసుకురాలేదు. ఆలోపు బయటకు వెళ్లేందుకు మార్గంలేక చివరకు విమానం రెక్క మీదకు వచ్చేశాం. రెక్క నుంచి ఎలా దిగాలో, ఎలా బయటపడాలో ఎవరికీ అర్థంకాలేదు. అందు కే అందరం అలా నిల్చుని హాహాకారాలు చేశాం. ఈలోపు సాయం చేయడానికి ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ఎవరూ ముందుకురాలేదు. ఈలోపు నా భర్త, కుమార్తె ఏమయ్యారో తెలియలేదు. భయంతో వణికిపోయా.
కుదురుగా ఒక్కచోట రెక్కపై నిలబడలేకపోయా’’అని ఇన్‌గ్రిడ్ హిబిట్ అనే మహిళ తెలిపింది. ‘‘అంతా సర్దుకుంటుందిలే అని మనసులో చెప్పుకున్నాగానీ మాకేమైపోతుందోనన్న భయం మరింత పెరిగింది. ఒక పది నిమిషాల తర్వాత ఎయిర్‌పోర్ట్ సిబ్బంది వచ్చి సహాయకచర్యలు హుటాహుటిన మొదలెట్టారు. కానీ ఆ ఒక్క పది నిమిషాలే పది యుగాలుగా గడిచాయి.
స్వల్ప గాయాలు మినహా అందరూ క్షేమంతా బయటపడటం నిజంగా అద్భుతంలా అనిపించింది’’అని ఆమె అన్నారు. ‘‘కుదుపులకు లోనైన కొద్దిసేపటి తర్వాత విమానం ల్యాండ్ అయిందికాబట్టి సరిపోయింది. ఒకవేళ ల్యాండ్ చేయకుంటే అలాగే వెళ్లిఉంటే మార్గమధ్యంలో ఆకాశంలో మంటలు చెలరేగి మేమంతా ఏమయ్యేవాళ్లమో’’అని ఆమె భయందోళనలు వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment