అస్సాంజేను విడుదల చేయాల్సిందే
ప్రపంచ దేశాలపై తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు అమెరికా మిత్ర దేశాలతో కలసి సాగించిన కుట్రలు, కుతంత్రాలను బట్టబయలు చేసిన వికీలీక్స్ అధినేత జూలియన్ అస్సాంజేకి అనుకూలంగా ఐక్యరాజ్యసమితి లీగల్ ప్యానెల్ శుక్రవారం తీర్పు చెప్పింది. ఏకపక్ష నిర్బంధం నుంచి ఆయన్ని విడుదల చేయాలని, ఆయన స్వేచ్ఛను హరించే హక్కు బ్రిటన్ ప్రభుత్వానికి లేదని, అలా చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని ఆ ప్యానెల్ అభిప్రాయపడింది.
ఈ తీర్పునకు తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని బ్రిటన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. తమ దేశాల చట్టాల ప్రకారం తాము నడుచుకుంటామని, ఈక్వెడార్ ఎంబసీ కార్యాలయం నుంచి అస్సాంజే బయటకు రాగానే ఆయన్ని అరెస్టు చేస్తామని బ్రిటన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. ఐరాస లీగల్ ప్యానెల్ తీర్పు గురించి అధికారికంగా తమకు ఎలాంటి నివేదక ఇప్పటివరకు అందలేదని కూడా తెలిపింది. వాస్తవానికి నిర్బంధం నుంచి అస్సాంజేను విడుదల చేయాలని లీగల్ ప్యానెల్ రెండు రోజుల క్రితమే నిర్ణయించి, ఆ నిర్ణయాన్ని సంబంధిత దేశాలకు ఇప్పటికే తెలియజేసింది. తీర్పు ప్రతిని శుక్రవారం రాత్రి విడుదల చేస్తామని ప్రకటించింది.
నాలుగేళ్లుగా అస్సాంజే.. లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో తలదాచుకుంటున్న విషయం తెల్సిందే. స్వీడన్ రేప్ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న అస్సాంజేని అరెస్టు చేసి, స్వీడన్‌కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం అప్పట్నుంచి ప్రయత్నిస్తోంది. ఏడాది క్రితం వరకు ఎంబసీ కార్యాలయం వద్ద బ్రిటన్ తమ పోలీసులతో 24 గంటలపాటు నిఘా పెట్టింది. ఆ తర్వాత ఎలాగూ దొంగదారిన తప్పించుకునే అవకాశం లేదని గ్రహించి నిఘాను తొలగించింది. ఈ అరెస్టును తప్పించుకునేందుకే ఆయన ఈక్వెడార్ ప్రభుత్వం శరణుగోరి ఎంబసీలో తలదాచుకుంటున్నారు.
అస్సాంజే తనపై వచ్చిన రేప్ ఆరోపణలను మొదటి నుంచి ఖండిస్తూ వస్తున్నారు. స్వీడన్‌లో ఈ ఆరోపణలపై విచారణను ఎదుర్కొనేందుకు అక్కడికి వెళ్తే.. అక్కడి ప్రభుత్వం తనను పట్టుకొని అమెరికాకు అప్పగిస్తుందన్నది అస్సాంజే భయం. అఫ్ఘాన్, ఇరాక్ యుద్ధాలకు సంబంధించి అమెరికా చేసిన కుట్రలు, కుతంత్రాలు, గ్వాంటనామో జైలుకు సంబంధించిన భయంకర వాస్తవాలు, మిత్ర దేశాలతో జరిపిన రహస్య చర్చలకు సంబంధించి అస్సాంజే తన సంస్థ వికీలీక్స్ పేరిట దాదాపు కోటి ఫైళ్లను ప్రపంచానికి విడుదల చేశారు. ఆస్ట్రేలియాలో సాధారణ కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా జీవితాన్ని ప్రారంభించిన అస్సాంజే ఇప్పుడు ప్రపంచానికి సుపరిచితుడు.