
పిల్లలకు నాన్న ప్రేమిస్తున్నాడని చెప్పు!
టునీస్: అప్పటివరకు ఆహ్లాదకరంగావున్న టూనిషియాలోని టూరిస్ట్ రిసార్ట్ హఠాత్తుగా అల్లకల్లోలంగా మారింది. ప్రేయసితో కలిసి సన్ బెడ్‌పై సేదతీరుతున్న ఓ బ్రిటీష్ తండ్రి మాథ్యూ జేమ్స్ (30) తరుముకొస్తున్న మృత్యువును ముందుగానే గ్రహించాడు. పక్కనేవున్న ప్రేయసిని ఒడిసి పట్టుకొని దూసుకొస్తున్న బుల్లెట్ల నుంచి ఆమెకు రక్షణ కవచంలా నిలబడ్డాడు. ‘బేబ్ నిన్నెంతో ప్రేమిస్తున్నా. పారిపో, పారిపో! పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. ఈ తండ్రి వారిని ఎంతగానో ప్రేమిస్తున్నానని మరీ మరీ చెప్పు’ అంతే...ఆ తండ్రి నోటి నుంచి మరో మాట రాలేదు. పొత్తి కడుపులో మూడు బుల్లెట్లు దిగడంతో రక్తం మడుగులో కుప్పకూలి పోయాడు. ఆయన ప్రేయసి సాయెర విల్సన్ (26) అక్కడి పారిపోయి హోటల్లోని బట్టల కప్‌బోర్డులో తలదాచుకుంది. కొన్ని గంట తర్వాత ఆమెకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ప్రియుడు మాథ్యూ నుంచే. ప్రాణాపాయ స్థితిలోవున్న తనను సమీపంలోని ఆస్పత్రిలో ఉన్నానని, ఆపరేషన్‌కు సిద్ధం చేస్తున్నారని చెప్పడంతోనే ఫోన్ కటయింది.
విల్సన్ ఆస్పత్రికి వెళ్లి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లోవున్న మాథ్యూను దూరం నుంచే చూసి బోరుమంది. ఆ తర్వాత అక్కడికెళ్లిన మీడియా ప్రతినిధులకు జరిగిన సంఘటనను వివరించి చెప్పింది. బ్రిటన్‌లోని కార్డిఫ్‌కు చెందిన తాము టునీషియాలోని బెల్లేవు హోటల్ రిసార్ట్‌కు వచ్చామని, శుక్రవారం ఉదయం హోటల్ ముందు సముద్రం ఒడ్డున సేదతీరుండగా, నల్లటి ముసుగు ధరించిన ఓ టెర్రరిస్ట్ విచక్షణారహితంగా కాల్పులు జరిపారని తెలిపింది. కాల్పుల్లో మాథ్యూ కటివలయం పూర్తిగా ధ్వంసమైందని, ప్రస్తుతం ఆయన బతికితే అంతేచాలని కోరుకుంటోంది. తమకు ఇద్దరు పిల్లలని, మాథ్యూ మొదటి భార్యకు ఒకరుండగా, తనతోని ఒకరు పుట్టారని ఆమె చెప్పింది. తమకు ఇంకా పెళ్లికాలేదని, వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చామని తెలిపింది. ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్ట్ జరిపిన కాల్పుల్లో 37 మంది మరణించగా, 36 మంది గాయపడిన విషయం తెల్సిందే. మృతుల్లో ఐదుగురు బ్రిటన్ దేశస్థులు ఉన్నారని బ్రిటన్ విదేశాంగ మంత్రి ఫిలిప్ హమ్మాండ్ శనివారం నాడు ప్రకటించారు.