ఆ దాడితో మాకు ఏం సంబంధం లేదు
కాబుల్: పాకిస్థాన్ ఎయిర్ బేస్పై ఉగ్రవాదులు జరిపిన దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని అఫ్గనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని అన్నారు. ఇటీవల పాకిస్థాన్లోని పెషావర్ వైమానిక దళ స్థావరంపై కొందరు ఉగ్రవాదులు దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 17మంది సామాన్య పౌరులు మృతిచెందగా మరో 13మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే, ఈ దాడి వెనుక అఫ్గనిస్థాన్ ప్రమేయం ఉందని పాకిస్థాన్ ఆరోపించింది.
పాక్ ఆరోపణలు ఖండించిన అష్రఫ్.. ఇలాంటివాటికి తమ దేశం ఏమాత్రం మద్దతు ఇవ్వదని, పరాయి దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే చర్యలకు తామెప్పుడు దిగబోమని స్పష్టం చేశారు. పాక్ అసత్య ప్రచారం మానుకుంటే మంచిదని హితవు పలికారు. ఇప్పటికే ఉగ్రవాదుల దాడుల కారణంగా తాము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని, మానసికంగా కూడా తమను ఉగ్రవాద దాడులు బాధపెడుతున్నాయని చెప్పారు. పాక్లో జరిగిన ఘటన తమకు ఎంతో బాధను కలిగించిందని, మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపారు.