నోటికి ప్లాస్టర్.. సంకెళ్లతో జడ్జి కుమారుడు
కరాచీ: తాలిబన్లు ఎత్తుకెళ్లిన పాకిస్థాన్ న్యాయమూర్తి కుమారుడు దొరికాడు. పాక్ సైనికులు అతడిని గుర్తించారు. నోటికి ప్లాస్టర్, చేతినిండా సంకెళ్లు వేసి పూర్తిగా బురఖా కప్పి ఉన్న అతడిని సైనికులు మంగళవారం తమ ఆదీనంలోకి తీసుకున్నారు. గత నెల(జూన్ 21)న సింధు ప్రావిన్స్ చీఫ్ జస్టిస్ సాజిద్ అలీ షా కుమారుడు అవాయిష్ షాను తాలిబన్ ఉగ్రవాదులు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే.
అప్పటి నుంచి తీవ్రంగా గాలింపులు జరిపినా అతడి జాడ తెలియలేదు. తన మిత్రుడిని కలిసి ఓ షాపింగ్ మాల్ వద్దకు వెళ్లి తిరిగొస్తుండగా గుర్తు తెలియని దుండగులు ఆయనను ఎత్తుకెళ్లారు. ఎట్టకేలకు అతడు ప్రాణాలతో దొరకడంతో ఆర్మీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కిడ్నాపర్లను సైన్యం కాల్చి చంపింది. తెల్లవారు జామున 2గంటల ప్రాంతంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. కార్లో వెనుక సీట్లో బందీగా ఉన్న అతడిని పాక్ పశ్చిమ భాగంలోని గిరిజన ప్రాంతంలో సైన్యం గుర్తించింది.