కౌలాలంపూర్: వీఎక్స్ (నర్వ్ ఏజెంట్) అనే అత్యంత ప్రమాదకర రసాయన విష ప్రయోగం వల్లనే ఉత్తర కొరియా నేత కిమ్ జంగ్ ఉన్ సవతి సోదరుడు కిమ్ జంగ్ నామ్ మరణించినట్లు శుక్రవారం మలేసియా పోలీసులు వెల్లడించారు. ఈ నెల 13న మకావ్ వెళ్లేందుకు కౌలాలంపూర్ విమానాశ్రయం చేరుకున్న కిమ్‌పై హఠాత్తుగా ఇద్దరు మహిళలు విషాన్ని చల్లారు. అది వాసన, రుచిలేని ఒక ప్రమాదకరమైన రసాయనమని పోలీసులు పేర్కొన్నారు.
ఒక్క చుక్క వీఎక్స్ ఏజెంట్ బాధితుడి కేంద్ర నాడీ వ్యవస్థపై ఎంతో ప్రభావాన్ని చూపుతుందన్నారు. నామ్ ముఖం, కళ్లల్లో ఆ విషం తాలూకు అవశేషాలను కనుగొన్నట్లు స్పష్టం చేశారు. ఆ ఇద్దరు మహిళల్లో ఒకరు ఘటనా స్థలంలోనే వాంతులు చేసుకుని సొమ్మసిల్లిపడిపోయారని పేర్కొన్నారు.