
సియోల్/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ శృతిమించుతోంది. ఇరువురు నేతలూ నీకు పిచ్చంటే... నీకు పిచ్చని వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఐక్యరాజ్య సమితి వేదికగా ఉత్తర కొరియాను సర్వనాశనం చేస్తానంటూ ట్రంప్ చేసిన ప్రసంగంపై కిమ్ స్పందిస్తూ... ట్రంప్‌కు మతి లేదని వ్యాఖ్యానించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్... ‘కిమ్ ఓ పిచ్చోడు’అంటూ బదులిచ్చారు.
‘ప్రపంచం ముందు నన్ను, నా దేశాన్ని ట్రంప్ అవమానించారు. ఆయన మానసిక స్థితి సరిగా లేదు. కొరియాపై ఆయన వ్యాఖ్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’అని కిమ్ హెచ్చరించినట్టు అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. దీనికి బదులుగా... ‘ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఓ పిచ్చోడు. సొంత ప్రజలను ఆకలితో మాడ్చడానికి, వారిని చంపడానికి కూడా వెనుకాడడు. ఇందుకు ఫలితం అనుభవించక తప్పదు’అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.
పసిఫిక్‌లో హైడ్రోజన్ బాంబ్..!
మరోవైపు ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రి యోంగ్ హూ... పసిఫిక్ మహాసముద్రంలో హైడ్రోజన్ బాంబు ప్రయోగించే అవకాశం ఉందన్న సంకేతాలిచ్చి అగ్గికి ఆజ్యం పోశారు. ఇది తమ అధినేత కిమ్ నిర్ణయంపై ఆధారపడి ఉందన్నారు.