వంటిల్లు + డైనింగ్ టేబుల్ + రిఫ్రిజిరేటర్ = సేపియన్ స్టోన్!
ఒకే దెబ్బకి రెండు పిట్టలు అని విన్నాం కానీ ఒకే దెబ్బకి మూడు పిట్టలు అంటే! ఊహించడానికి భలే ఉంది కదా.. ఈ ఫొటోలో కనిపిస్తున్న డైనింగ్ టేబుల్ దీనికి చక్కని ఉదాహరణ. ఎందుకంటే ఈ డైనింగ్ టేబుల్ మీదే వంటలు చే యొచ్చు.. ఆహార పదార్థాలను వేడిగానూ, చల్లగానూ ఉండేలా చేయొచ్చు. ఏంటీ నమ్మలేక పోతున్నారా అయితే ఈ ఫొటోలో ఎడమవైపు నిలుచున్న వ్యక్తి ఏం చేస్తున్నాడో ఒకసారి చెప్పండి. ఏముందీ అందరికీ భోజనం వ డ్డిస్తున్నాడు అని అనుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే అతను వంట చేస్తున్నాడు. ఇక భోజనం చేస్తున్న వారి పక్కనే ఓ షాంపెయిన్ బాటిల్ కనిపిస్తోందా? అది ఫ్రిజ్‌లో ఉన్నట్లే చల్లగా ఉంది. ఒకవైపు వేడి, మరోవైపు చల్లదనమా? ఇదెలా సాధ్యం అనుకోకండి.
సేపియన్ స్టోన్ స్మార్ట్ స్లాబ్ ప్రత్యేకత అదే మరి. ఈ టేబుల్‌పైన ఉపయోగించిన స్లాబ్‌ను పింగాణి వంటి పదార్థంతో తయారు చేశారు. స్లాబ్ అడుగు భాగంలో నిర్ణీత ప్రదేశాల్లో ఇండక్షన్ కుక్కర్లు ఏర్పాటు చేశారు. వీటితోపాటు అక్కడక్కడా చల్లదనాన్ని ఇచ్చేందుకు, ప్లేట్స్ ఉంచే చోటులో ఆహారాన్ని వెచ్చగా (గరిష్టంగా 42.5 డిగ్రీ సెల్సియస్) ఉంచేందుకు అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయి. ప్రత్యేకమైన పింగాణీ కాబట్టి ఏ ప్రాంతంలోని ఉష్ణోగ్రత అక్కడే ఉంటుందన్నమాట. స్వీడన్, జర్మనీలకు చెందిన డిజైనర్ సంస్థ క్రామ్/వైస్‌హార్ దీన్ని అభివృద్ధి చేసింది.