కోహినూర్ వజ్రం రక్తచరిత్ర
ఇంగ్లండ్ : కోహినూర్ వజ్రం గురించి మనం తరతరాలుగా వింటున్నాం. వాస్తవానికి ‘కో–హి–నూర్’ అనే పేరు పర్షియన్ పేరు. దీని అర్థం కాంతి శిఖరం అని. 105 క్యారెట్లు, అంటే 21 గ్రాముల బరువు కలిగిన ఈ వజ్రం ప్రస్తుతం బ్రిటీష్ రాణి ఎలిజబెత్–2 ఆధ్వర్యంలో లండన్ టవర్‌లో భద్రంగా ఉంది. దక్షిణ భారత దేశం నుంచి ఇంగ్లండ్ వెల్లిన ఈ వజ్రం మాదంటే మాదంటూ భారత్, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, చివరకు తాలిబన్లు కూడా వాదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు దగ్గరి ఖిల్లా నుంచి, కాదు హైదరాబాద్‌లోని గోల్కొండ ఖిల్లా నుంచి కోహినూర్ వజ్రం ఇంగ్లండ్‌కు చేరిందనే వాదనలు కూడా బలంగానే ఉన్నాయి.
రాజసానికి, దర్పాణికి ప్రతీకగా నిలిచిన ఈ వజ్రం చరిత్ర సమస్తం రణరంగ రక్తసిక్తమే. ఈ వజ్రం ధరించడం వల్ల మంచి జరిగిన సందర్భాలు కనిపించవుగానీ చెడు జరిగిన సందర్భాలే చరిత్రలో ఎక్కువగా ఉన్నాయి. కోహినూర్ వజ్రాన్ని ఇంగ్లండ్‌కు నౌకలో తీసుకొస్తుండగా, ఆ నౌకలో కలరా వ్యాపించింది. ఆ నౌకను రోగులతో సహా సముద్రం ఒడ్డులో వదిలేశారు. కోహినూర్ వజ్రాన్ని కలిగి ఉన్న బ్రిటీష్ అధికారి, మరికొందరు సిబ్బంది క్షేమంగా ఇంగ్లండ్‌కు చేరుకున్నారు. కోహినూర్ ఇంగ్లండ్ గడ్డపైకి వచ్చిన రోజునే రాణి విక్టోరియాపై హత్యాయత్నం జరిగింది. ఆమె తలపై బలమైన గాయం అయింది. అప్పటి ప్రధాన మంత్రి రాబర్ట్ పీల్ ప్రమాదవశాత్తు గుర్రం మీది నుంచి కింద పడి మరణించారు.
చరిత్రలో కోహినూర్ ఎక్కడ పుట్టిందో తెలియజేసే ఆధారాలు ఇప్పటికీ లభించలేదు. దక్షిణ భారత దేశంలోని ఓ గుడిలోని దేవత కంటిలో ఈ కోహినూర్ వజ్రం ఉండేదని, ఆ కంటిలో నుంచి తీసుకరావడం వల్లనే కోహినూర్ వజ్రం వల్ల చెడు జరుగుతుందన్న వాదనలు ఉన్నాయి. అయితే వాటికి చారిత్రక ఆధారాలు లేవు. క్రీస్తు పూర్వం ఆసియాలో రాజులు, సంస్థానదీషుల వద్దనే కాకుండా కులీనవర్గ ప్రజలకు ఎక్కువగా వజ్రాలను ఉంగరాల్లో ధరించే అలవాటు ఉండేది. కోహినూర్ గురించి తొలి ప్రస్థావన క్రీస్తు శకం 1547లో ఉంది.
షాజహాన్ వద్దకు....
తాజ్‌మహల్‌ను నిర్మించిన షాజహాన్ వద్దకు కోహినూర్ వజ్రం 1656లో చేరింది. ఆయన మగ నెమలి సింహాసనాన్ని తయారు చేయించి అందులో దీన్ని అమర్చారు. ఎవరు ఎత్తుకుపోకుండా ఆ సింహాసనానికి నపుంసకుల రక్షణ పెట్టారు. ఆ తర్వాత ఆయన్ని కుమారులే బంధించి కారాగారంలో పెట్టారు. ఆ కారాగారంలోనే ఆయన మరణించారు. ఆ తర్వాత సింహాసనాన్ని అధిష్టించిన ఆయన కుమారులు కూడా అధోగతి పాలయ్యారు. 1739లో ఢిల్లీపై పర్షియన్ రాజులు దండయాత్రలు జరిపారు. అప్పుడు రొడ్లవెంట రక్తం ఏరులై పారింది. 700 ఏనుగులు, 4000 ఒంటెలు, 12000 గుర్రాలపై మొఘల్ రాజుల సంపదనను ఇరాన్‌లోని టెహరాన్‌కు పర్షియన్ రాజులు తరలించారు.
నాదర్ షా వద్దకు...
ఈ యుద్ధంలో ఓడిపోయిన మొఘల్ చక్రవర్తి మొహమ్మద్ షా నుంచి పర్షియన్ రాజు నాదర్ షా వద్దకు కోహినూర్ వజ్రం వచ్చి చేరింది. ఆయన దాన్ని తన కిరీటంలో పెట్టుకున్నారు. ఆయన బతికుండగానే ఆయన కుమారుడి రెండు కళ్లను పీకి వాటిని పళ్లెంలో పెట్టి శత్రువులు నాదర్ షాకు పంపించారు. ఆ తర్వాత నాదర్ షా హత్యకు గురయ్యారు. కోహినూర్ వజ్రం చేతులుమారి అఫ్ఘానిస్తాన్‌లోని కాందహార్‌కు చేరుకుంది. నాదర్ షా మనమడు ఆ వజ్రాన్ని తిరిగి సాధించే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయారు.
మొఘల్ చక్రవర్తి అహ్మద్ షా వద్దకు...
ముఘల్ చక్రవర్తి అహ్మద్ షా వద్దకు 1750వ దశకంలో కోహినూర్ వజ్రం చేరింది. ఆయనకు కొంతకాలానికే ముఖంపైనా క్యాన్సర్ పుండు వచ్చింది. 1772 ప్రాంతంలో ఆయన శత్రువుల చేతుల్లో మరణించారు. అదే సమయంలో ఆయన ఈ వజ్రాన్ని ఓ గోడ సందులో దాచారట. అది ఓ అఫ్ఘాన్ అంగరక్షకుడి ద్వారా కాబూల్‌కు వెళ్లింది. అక్కడ ఓ వజ్రాల హారం ద్వారా కోహినూర్ వజ్రం మహారాజ రంజిత్ సింగ్ వద్దకు 1839లో చేరింది. కొన్ని రోజులకే ఆయన హత్యకు గురయ్యారు.
బ్రిటీష్ పాలకుల చేతుల్లోకి...
ఆ తర్వాత పదేళ్లకు బ్రిటీషర్లు పంజాబ్‌పై దాడిచేసి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు కోహినూర్ వజ్రం చాలా విలువైందనే ప్రచారం ఉండింది. అప్పుడు బ్రిటీష్ రాణి విక్టోరియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న డల్‌హౌజ్‌కు చెందిన బ్రిటిష్ అధికారి చేతికి చేరింది. ఆయన దాన్ని ఇంగ్లండ్ తీసుకెళ్లారు. అక్కడ బ్రిటీష్ మ్యూజియంలో దీన్ని 1851లో ప్రదర్శించారు. అప్పటికీ కోహినూర్ వజ్రం వన్నె చాలా తగ్గిపోయింది. దాంతో విక్టోరియా రాణి దానికి సానపట్టించారు. ఫలితంగా వజ్రం అసలు బరువులో 42 శాతం తరగుపోయింది. ఆమె తన పారిస్ పర్యటన సందర్భంతో మొదటిసారి దీన్ని ధరించారు. ఆ తర్వాత పలు సందర్భాల్లో ధరించారు. ఆమె మరణించే ముందు కింగ్ చార్లెస్ ప్రమాణ స్వీకారం సందర్భంగా వారి భార్యలైన రాణులు మాత్రమే దీన్ని ధరించాలని వీలునామా రాశారు.
ఎలిజబెత్ రాణి వ్యక్తిగతంగా ఇంతవరకు దీన్ని ధరించిన సందర్భాలు కనిపించలేదు. అందుకనే ఆమె ఇంతకాలం బతికి ఉన్నారనే వాదన ఉంది. ఇక ఎలజబెత్ కుమారుడు కింగ్ చార్లెస్‌కు త్వరలో పట్టాభిషేకం జరుగుతుందని, ఈ సందర్భంగా ఆయన రెండో భార్య కమెల్లా ఈ కోహినూర్ వజ్రపు కిరీటాన్ని ధరిస్తారన్న ప్రచారం ఉంది. ఈ ర క్త చరిత్ర వెలుగులోకి వచ్చాక కూడా ఆమె దీన్ని ధరించేందుకు సాహసిస్తారా లేదా చూడాలి.
(గమనిక: కోహినూర్ వజ్రం ప్రస్తావన ఉన్న వివిధ చరిత్ర పుస్తకాలు, పత్రాలను పరిశీలించి రచయితలు విలియం డాల్‌రింపుల్. అనితా ఆనంద్ రాసిన ‘కోహినూర్–ది హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ మోస్ట్ ఇన్‌ఫేమస్ డైమండ్ పుస్తకంలోని అంశాల ఆధారంగా ఈ వార్తాకథనం. ఈ పుస్తకం 17 పౌండ్లకు అంతర్జాతీయ మార్కెట్‌లో లభిస్తోంది).