Shajahan
-
షాజహాన్ షేక్ ఇంట్లో సీబీఐ సోదాలు
కోల్‌కతా: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)అధికారులపై దాడి కేసులో బహిష్కృత టీఎంసీ నేత షాజహాన్ షేక్ ఇల్లు, ఆఫీసుల్లో సీబీఐ అధికారులు శుక్రవారం సోదాలు జరిపారు. దాడికి సంబంధించిన ఆధారాల కోసం ఉత్తర 24 పరగణాల జిల్లా సందేశ్‌ఖాలిలోని షాజహాన్ షేక్ నివాసం సమీప ప్రాంతాలను కూడా పరిశీలించారు. రేషన్ పంపిణీ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా జనవరి 5వ తేదీన షాజహాన్ షేక్ ఇంట్లో సోదాలకు వెళ్లిన 14 మంది అధికారుల బృందంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో సీబీకి చెందిన ఆరుగురు, సెంట్రల్ ఫోరెన్సిక్ నిపుణులు ఆరుగురు, ఈడీ అధికారులు ఇద్దరు గాయపడ్డారు. ఘటనతో సంబంధముందన్న ఆరోపణలపై టీఎంసీ నుంచి షాజహాన్ షేక్ సస్పెండయ్యాడు. హైకోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో గురువారం షాజహాన్ షేక్‌ను అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు, సందేశ్‌ఖాలిలోని అతడి నివాసం, కార్యాలయాలకు సీల్ వేశారు. -
బ్రిటన్ ఎత్తుకెళ్లిన వస్తువులు.. సంపద ఎంతో తెలుసా?
సాక్షి, అమరావతి: బ్రిటిష్ సామ్రాజ్యం.. దాని కాలనీలు మన దేశం సహా ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి లెక్కలేనన్ని విలువైన కళాఖండాలను దోచుకెళ్లింది. 16వ శతాబ్దం చివరి నుంచి 20వ శతాబ్దం వరకు బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచవ్యాప్తంగా తన కాలనీలు, వలస రాజ్యాలు, రక్షిత ప్రాంతాలను స్థాపించింది. బ్రిటన్‌లోని పలు మ్యూజియాలలో ప్రస్తుతం ప్రదర్శనలో ఉన్న అనేక సాంస్కృతిక కళాఖండాలు వలస రాజ్యాల ప్రజల నుంచి దోచుకున్నవే. వాటిని తిరిగి ఇచ్చేయాలని ఆ దేశాలు కోరుతున్నా.. బ్రిటన్ పట్టించుకోవడం లేదు. కోహినూర్ వజ్రం నుంచి బెనిన్ కాంస్యాలు, పారి్థనాన్ మార్బుల్స్ వంటి 8 మిలియన్లకుపైగా కళాఖండాలు బ్రిటిష్ మ్యూజియంలలో ఉన్నట్టు అంచనా. వాటిలో అత్యంత విలువైనవి కొన్ని ఇవే. టిప్పుసుల్తాన్ ఉంగరం ఈస్టిండియా కంపెనీతో 1799లో జరిగిన యుద్ధంలో టిప్పుసుల్తాన్ ఓడిపోయిన తర్వాత.. బ్రిటిష్ దళాలు సుల్తాన్‌ను చంపి ఆయన ఖడ్గం, బొమ్మ పులి, చేతి వేలి నుంచి ఉంగరాన్ని తీసుకెళ్లారు. సుల్తాన్ ఉంగరంపై దేవనాగరి లిపిలో రాముడి పేరు చెక్కి ఉండేది. ఖడ్గాన్ని భారతదేశానికి తిరిగి రప్పించారు. 41 గ్రాముల ఈ ఉంగరాన్ని 2014లో వేలం వేయగా.. అంచనా ధర కంటే పది రెట్లు ఎక్కువ ధర చెల్లించి ఒక వ్యక్తి కొనుగోలు చేశారు. టిప్పుసుల్తాన్‌కు చెందిన వేసవి రాజభవనం నుంచి తీసుకెళ్లిన బొమ్మ పులి ప్రస్తుతం విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంది. కోహినూర్ వజ్రం ప్రపంచంలోనే అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని భారతదేశం నుంచి బ్రిటిషర్లు తీసుకుపోయారు. 105.6 క్యారెట్లు, 21.6 గ్రాముల బరువున్న కోహినూర్ వజ్రాన్ని ప్రస్తుత ఏపీలోని కొల్లూరు గనిలో సేకరించారు. మొఘల్ చక్రవర్తులు నెమలి సింహాసనంపై దీన్ని ఉంచేవారు. మొదట దీన్ని సేకరించినప్పుడు 793 క్యారెట్లతో ఉండేది. ఆ తర్వాత దాన్ని కట్ చేశారు. 1849లో బ్రిటిషర్లు దాన్ని విక్టోరియా రాణికి అప్పగించారు. ఆమె దాన్ని పలు సందర్భాల్లో తన కిరీటంపై ధరించేవారు. ప్రస్తుతం ఇది లండన్ టవర్‌కి చెందిన జ్యువెల్ హౌస్ మ్యూజియంలో ఉంది. కోహినూర్ ప్రపంచంలోనే పురాతన, అత్యంత ప్రసిద్ధ వజ్రాలలో ఒకటి. ఎల్గిన్ మార్బుల్స్ ఎల్గిన్ మార్బుల్స్ పురాతన గ్రీకు శిల్పాల సమాహారం. గ్రీస్‌లోని పార్థినాన్ నుంచి 1801–1805 సంవత్సరాల మధ్య బ్రిటిషర్లు ఎథీనా దేవతకు అంకితం చేసిన ఈ శిల్పాలను తీసుకెళ్లారు. ఈ శిల్పాలు గ్రీకుల గొప్పతనం, వారి వారసత్వం, చరిత్రను తెలుపుతాయి. 1453 నుండి దాదాపు 400 సంవత్సరాల పాటు ఒట్టోమన్ సామ్రాజ్యం గ్రీకును పాలించింది. ఆ సమయంలో బ్రిటిష్ రాయబారి లార్డ్ ఎల్గిన్, పారి్థనాన్ శిథిలాల నుంచి ఈ శిల్పాలను సేకరించి తీసుకెళ్లారని చెబుతారు. బ్రెజిల్ రబ్బరు విత్తనాలు బ్రెజిల్‌కే సొంతమైన హెవియా బ్రాసిలియెన్సిస్ (రబ్బరు చెట్టు) 70 వేల విత్తనాలను 1876లో బ్రిటిష్ యాత్రికుడు హెన్రీ విక్హామ్ దొంగిలించాడు. ఇది చరిత్ర గతిని మార్చిన ఘటనగా పేర్కొంటారు. బ్రెజిల్‌లోని శాంటారెమ్ ప్రాంతంలోని 140 అడుగుల ఎత్తుకు పెరిగిన రబ్బరు చెట్టు విత్తనాలవి. అప్పటివరకు రబ్బరు పరిశ్రమపై బ్రెజిల్‌కు ఉన్న ఆధిపత్యం ఈ ఘటనతో చెదిరిపోయింది. ఈ విత్తనాలు ప్రస్తుతం లండన్ మ్యూజియంలో ఉన్నాయి. రోసెట్టా స్టోన్ ఈజిప్టులోని రోసెట్టా ప్రాంతంలో దొరికిన పురాతన శాసనం ఇది. ఈజిప్టును పాలించిన టోలెమీ 196 బీసీలో నల్లటి బసాల్ట్ గ్రానైట్ రాయిపై ఈ శాసనాన్ని చెక్కించారు. మూడు విభిన్న ఈజిప్టియన్ భాషల్లో రాసిన ఈ శాసనం తన సామ్రాజ్యం, తాను చేసిన పనుల గురించి ఇందులో రాయించారు. 1799లో ఈ రాయిని కనుగొన్నారు. నెపోలియన్ బోనపార్టీ ఈజిప్టు నుంచి దీన్ని స్వా«దీనం చేసుకున్నారు. 1800 సంవత్సరంలో ఫ్రెంచ్ సైన్యం ఓడిపోయిన తర్వాత బ్రిటిషర్లు దీన్ని స్వా«దీనం చేసుకుని బ్రిటన్‌కు తరలించారు. ప్రాచీన ఈజిప్టు సామ్రాజ్యం, గ్రీకుల సంస్కృతి, వారసత్వం గురించి తెలిపే అత్యంత విలువైన శాసనంగా దీన్ని పరిగణిస్తారు. అందుకే దీన్ని తిరిగి ఇవ్వాలని ఈజిప్టు దేశం బ్రిటన్ను కోరినా పట్టించుకోలేదు. షాజహాన్ వైన్ జార్ మొఘల్ చక్రవర్తి షాజహాన్ వైన్ తాగే జార్‌ను కూడా బ్రిటిషర్లు తీసుకెళ్లి అక్కడి మ్యూజియంలో పెట్టుకున్నారు. తెల్లటి కప్పులా ఉండే ఈ జార్ దిగువ భాగంలో కమలం, ఆకులను పోలి ఉండేది. హ్యాండిల్‌పై కొమ్ము, గడ్డంతో ఉన్న జంతువు ఉండేది. 19వ శతాబ్దంలో ఈ అందమైన వైన్ జార్‌ను కల్నల్ చార్లెస్ సెటన్ గుత్రీ దొంగిలించి బ్రిటన్‌కు పంపినట్టు చెబుతారు. 1962 నుంచి ఇది లండన్‌లోని విక్టోరియా మ్యూజియంలో ఉంది. బెనిన్ కాంస్యాలు ఒకప్పటి బెనిన్ రాజ్యమే ఇప్పటి నైజీరియా. 1897లో బ్రిటిషర్లు బెనిన్‌పై దాడిచేసి ఆ నగరాన్ని దోచుకుంది. అక్కడి రాజ భవనంలో ఉన్న చారిత్రాత్మక వస్తువులు, 200కిపైగా కాంస్య ఫలకాలు ఇప్పుడు బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి. 1960లో స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి నైజీరియా పలుసార్లు ఈ కాంస్యాలను తిరిగి ఇవ్వాలని కోరినా ఫలితం లేదు. ఇది కూడా చదవండి: ఒక ఇమ్రాన్.. రెండు కేసులు -
అమెరికాలో వేలానికి షాజహాన్ కత్తి
న్యూఢిల్లీ: మొఘల్ చక్రవర్తి షాజహాన్‌కు చెందిన వజ్రాలు పొదిగిన కత్తి, కపుర్తలా రాజు జగత్జిత్ సింగ్‌కు చెందిన ఖడ్గం సహా 400 పురాతన వస్తువులను జూన్ 19న వేలం వేయనున్నట్లు క్రీస్టీ సంస్థ తెలిపింది. సింహం తలలాంటి పిడితో వజ్రాలు పొదిగిన జగత్జిత్ సింగ్ ఖడ్గం ప్రారంభధర రూ.69 లక్షలుగా ఉంటుందని వెల్లడించింది. అలాగే మొఘల్ చక్రవర్తి షాజహాన్‌కు చెందిన కత్తికి ఈ వేలంలో రూ.17.36 కోట్లు దక్కవచ్చని భావిస్తున్నారు. జైపూర్‌రాజు సవాయ్ మాన్సింగ్–2 భార్య రాణి గాయత్రీదేవికి చెందిన వజ్రాలు, ముత్యాలు పొదిగిన హారానికి రూ.10.42 కోట్లు రావొచ్చని అంచనా వేస్తున్నారు. పట్టాభిషేకం సందర్భంగా నిజాం రాజులు వాడిన వజ్రాలు, రత్నాలు, కెంపులు పొదిగిన ఖడ్గం 6.94 కోట్ల నుంచి రూ.10.42 కోట్ల వరకూ దక్కవచ్చని క్రీస్టీ సంస్థ పేర్కొంది. వీటితో పాటు టిప్పు సుల్తాన్ లాకెట్‌తో పాటు పలు ఆభరణాలు, వజ్రాలు, అలంకరణ వస్తువులను జూన్ 14–18 మధ్య న్యూయార్క్‌లో ప్రదర్శనకు ఉంచనున్నట్లు చెప్పింది. -
కోహినూర్ వజ్రం రక్తచరిత్ర
ఇంగ్లండ్ : కోహినూర్ వజ్రం గురించి మనం తరతరాలుగా వింటున్నాం. వాస్తవానికి ‘కో–హి–నూర్’ అనే పేరు పర్షియన్ పేరు. దీని అర్థం కాంతి శిఖరం అని. 105 క్యారెట్లు, అంటే 21 గ్రాముల బరువు కలిగిన ఈ వజ్రం ప్రస్తుతం బ్రిటీష్ రాణి ఎలిజబెత్–2 ఆధ్వర్యంలో లండన్ టవర్‌లో భద్రంగా ఉంది. దక్షిణ భారత దేశం నుంచి ఇంగ్లండ్ వెల్లిన ఈ వజ్రం మాదంటే మాదంటూ భారత్, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, చివరకు తాలిబన్లు కూడా వాదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు దగ్గరి ఖిల్లా నుంచి, కాదు హైదరాబాద్‌లోని గోల్కొండ ఖిల్లా నుంచి కోహినూర్ వజ్రం ఇంగ్లండ్‌కు చేరిందనే వాదనలు కూడా బలంగానే ఉన్నాయి. రాజసానికి, దర్పాణికి ప్రతీకగా నిలిచిన ఈ వజ్రం చరిత్ర సమస్తం రణరంగ రక్తసిక్తమే. ఈ వజ్రం ధరించడం వల్ల మంచి జరిగిన సందర్భాలు కనిపించవుగానీ చెడు జరిగిన సందర్భాలే చరిత్రలో ఎక్కువగా ఉన్నాయి. కోహినూర్ వజ్రాన్ని ఇంగ్లండ్‌కు నౌకలో తీసుకొస్తుండగా, ఆ నౌకలో కలరా వ్యాపించింది. ఆ నౌకను రోగులతో సహా సముద్రం ఒడ్డులో వదిలేశారు. కోహినూర్ వజ్రాన్ని కలిగి ఉన్న బ్రిటీష్ అధికారి, మరికొందరు సిబ్బంది క్షేమంగా ఇంగ్లండ్‌కు చేరుకున్నారు. కోహినూర్ ఇంగ్లండ్ గడ్డపైకి వచ్చిన రోజునే రాణి విక్టోరియాపై హత్యాయత్నం జరిగింది. ఆమె తలపై బలమైన గాయం అయింది. అప్పటి ప్రధాన మంత్రి రాబర్ట్ పీల్ ప్రమాదవశాత్తు గుర్రం మీది నుంచి కింద పడి మరణించారు. చరిత్రలో కోహినూర్ ఎక్కడ పుట్టిందో తెలియజేసే ఆధారాలు ఇప్పటికీ లభించలేదు. దక్షిణ భారత దేశంలోని ఓ గుడిలోని దేవత కంటిలో ఈ కోహినూర్ వజ్రం ఉండేదని, ఆ కంటిలో నుంచి తీసుకరావడం వల్లనే కోహినూర్ వజ్రం వల్ల చెడు జరుగుతుందన్న వాదనలు ఉన్నాయి. అయితే వాటికి చారిత్రక ఆధారాలు లేవు. క్రీస్తు పూర్వం ఆసియాలో రాజులు, సంస్థానదీషుల వద్దనే కాకుండా కులీనవర్గ ప్రజలకు ఎక్కువగా వజ్రాలను ఉంగరాల్లో ధరించే అలవాటు ఉండేది. కోహినూర్ గురించి తొలి ప్రస్థావన క్రీస్తు శకం 1547లో ఉంది. షాజహాన్ వద్దకు.... తాజ్‌మహల్‌ను నిర్మించిన షాజహాన్ వద్దకు కోహినూర్ వజ్రం 1656లో చేరింది. ఆయన మగ నెమలి సింహాసనాన్ని తయారు చేయించి అందులో దీన్ని అమర్చారు. ఎవరు ఎత్తుకుపోకుండా ఆ సింహాసనానికి నపుంసకుల రక్షణ పెట్టారు. ఆ తర్వాత ఆయన్ని కుమారులే బంధించి కారాగారంలో పెట్టారు. ఆ కారాగారంలోనే ఆయన మరణించారు. ఆ తర్వాత సింహాసనాన్ని అధిష్టించిన ఆయన కుమారులు కూడా అధోగతి పాలయ్యారు. 1739లో ఢిల్లీపై పర్షియన్ రాజులు దండయాత్రలు జరిపారు. అప్పుడు రొడ్లవెంట రక్తం ఏరులై పారింది. 700 ఏనుగులు, 4000 ఒంటెలు, 12000 గుర్రాలపై మొఘల్ రాజుల సంపదనను ఇరాన్‌లోని టెహరాన్‌కు పర్షియన్ రాజులు తరలించారు. నాదర్ షా వద్దకు... ఈ యుద్ధంలో ఓడిపోయిన మొఘల్ చక్రవర్తి మొహమ్మద్ షా నుంచి పర్షియన్ రాజు నాదర్ షా వద్దకు కోహినూర్ వజ్రం వచ్చి చేరింది. ఆయన దాన్ని తన కిరీటంలో పెట్టుకున్నారు. ఆయన బతికుండగానే ఆయన కుమారుడి రెండు కళ్లను పీకి వాటిని పళ్లెంలో పెట్టి శత్రువులు నాదర్ షాకు పంపించారు. ఆ తర్వాత నాదర్ షా హత్యకు గురయ్యారు. కోహినూర్ వజ్రం చేతులుమారి అఫ్ఘానిస్తాన్‌లోని కాందహార్‌కు చేరుకుంది. నాదర్ షా మనమడు ఆ వజ్రాన్ని తిరిగి సాధించే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయారు. మొఘల్ చక్రవర్తి అహ్మద్ షా వద్దకు... ముఘల్ చక్రవర్తి అహ్మద్ షా వద్దకు 1750వ దశకంలో కోహినూర్ వజ్రం చేరింది. ఆయనకు కొంతకాలానికే ముఖంపైనా క్యాన్సర్ పుండు వచ్చింది. 1772 ప్రాంతంలో ఆయన శత్రువుల చేతుల్లో మరణించారు. అదే సమయంలో ఆయన ఈ వజ్రాన్ని ఓ గోడ సందులో దాచారట. అది ఓ అఫ్ఘాన్ అంగరక్షకుడి ద్వారా కాబూల్‌కు వెళ్లింది. అక్కడ ఓ వజ్రాల హారం ద్వారా కోహినూర్ వజ్రం మహారాజ రంజిత్ సింగ్ వద్దకు 1839లో చేరింది. కొన్ని రోజులకే ఆయన హత్యకు గురయ్యారు. బ్రిటీష్ పాలకుల చేతుల్లోకి... ఆ తర్వాత పదేళ్లకు బ్రిటీషర్లు పంజాబ్‌పై దాడిచేసి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు కోహినూర్ వజ్రం చాలా విలువైందనే ప్రచారం ఉండింది. అప్పుడు బ్రిటీష్ రాణి విక్టోరియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న డల్హౌజ్కు చెందిన బ్రిటిష్ అధికారి చేతికి చేరింది. ఆయన దాన్ని ఇంగ్లండ్ తీసుకెళ్లారు. అక్కడ బ్రిటీష్ మ్యూజియంలో దీన్ని 1851లో ప్రదర్శించారు. అప్పటికీ కోహినూర్ వజ్రం వన్నె చాలా తగ్గిపోయింది. దాంతో విక్టోరియా రాణి దానికి సానపట్టించారు. ఫలితంగా వజ్రం అసలు బరువులో 42 శాతం తరగుపోయింది. ఆమె తన పారిస్ పర్యటన సందర్భంతో మొదటిసారి దీన్ని ధరించారు. ఆ తర్వాత పలు సందర్భాల్లో ధరించారు. ఆమె మరణించే ముందు కింగ్ చార్లెస్ ప్రమాణ స్వీకారం సందర్భంగా వారి భార్యలైన రాణులు మాత్రమే దీన్ని ధరించాలని వీలునామా రాశారు. ఎలిజబెత్ రాణి వ్యక్తిగతంగా ఇంతవరకు దీన్ని ధరించిన సందర్భాలు కనిపించలేదు. అందుకనే ఆమె ఇంతకాలం బతికి ఉన్నారనే వాదన ఉంది. ఇక ఎలజబెత్ కుమారుడు కింగ్ చార్లెస్‌కు త్వరలో పట్టాభిషేకం జరుగుతుందని, ఈ సందర్భంగా ఆయన రెండో భార్య కమెల్లా ఈ కోహినూర్ వజ్రపు కిరీటాన్ని ధరిస్తారన్న ప్రచారం ఉంది. ఈ ర క్త చరిత్ర వెలుగులోకి వచ్చాక కూడా ఆమె దీన్ని ధరించేందుకు సాహసిస్తారా లేదా చూడాలి. (గమనిక: కోహినూర్ వజ్రం ప్రస్తావన ఉన్న వివిధ చరిత్ర పుస్తకాలు, పత్రాలను పరిశీలించి రచయితలు విలియం డాల్రింపుల్. అనితా ఆనంద్ రాసిన ‘కోహినూర్–ది హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ మోస్ట్ ఇన్‌ఫేమస్ డైమండ్ పుస్తకంలోని అంశాల ఆధారంగా ఈ వార్తాకథనం. ఈ పుస్తకం 17 పౌండ్లకు అంతర్జాతీయ మార్కెట్లో లభిస్తోంది).