సాక్షి, అమరావతి: బ్రిటిష్ సామ్రాజ్యం.. దాని కాలనీలు మన దేశం సహా ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి లెక్కలేనన్ని విలువైన కళాఖండాలను దోచుకెళ్లింది. 16వ శతాబ్దం చివరి నుంచి 20వ శతాబ్దం వరకు బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచవ్యాప్తంగా తన కాలనీలు, వలస రాజ్యాలు, రక్షిత ప్రాంతాలను స్థాపించింది. బ్రిటన్‌లోని పలు మ్యూజియాలలో ప్రస్తుతం ప్రదర్శనలో ఉన్న అనేక సాంస్కృతిక కళాఖండాలు వలస రాజ్యాల ప్రజల నుంచి దోచుకున్నవే. వాటిని తిరిగి ఇచ్చేయాలని ఆ దేశాలు కోరుతున్నా.. బ్రిటన్ పట్టించుకోవడం లేదు. కోహినూర్ వజ్రం నుంచి బెనిన్ కాంస్యాలు, పారి్థనాన్ మార్బుల్స్ వంటి 8 మిలియన్లకుపైగా కళాఖండాలు బ్రిటిష్ మ్యూజియంలలో ఉన్నట్టు అంచనా. వాటిలో అత్యంత విలువైనవి కొన్ని ఇవే.
టిప్పుసుల్తాన్ ఉంగరం
ఈస్టిండియా కంపెనీతో 1799లో జరిగిన యుద్ధంలో టిప్పుసుల్తాన్ ఓడిపోయిన తర్వాత.. బ్రిటిష్ దళాలు సుల్తాన్‌ను చంపి ఆయన ఖడ్గం, బొమ్మ పులి, చేతి వేలి నుంచి ఉంగరాన్ని తీసుకెళ్లారు. సుల్తాన్ ఉంగరంపై దేవనాగరి లిపిలో రాముడి పేరు చెక్కి ఉండేది. ఖడ్గాన్ని భారతదేశానికి తిరిగి రప్పించారు. 41 గ్రాముల ఈ ఉంగరాన్ని 2014లో వేలం వేయగా.. అంచనా ధర కంటే పది రెట్లు ఎక్కువ ధర చెల్లించి ఒక వ్యక్తి కొనుగోలు చేశారు. టిప్పుసుల్తాన్‌కు చెందిన వేసవి రాజభవనం నుంచి తీసుకెళ్లిన బొమ్మ పులి ప్రస్తుతం విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంది.
కోహినూర్ వజ్రం
ప్రపంచంలోనే అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని భారతదేశం నుంచి బ్రిటిషర్లు తీసుకుపోయారు. 105.6 క్యారెట్లు, 21.6 గ్రాముల బరువున్న కోహినూర్ వజ్రాన్ని ప్రస్తుత ఏపీలోని కొల్లూరు గనిలో సేకరించారు. మొఘల్ చక్రవర్తులు నెమలి సింహాసనంపై దీన్ని ఉంచేవారు. మొదట దీన్ని సేకరించినప్పుడు 793 క్యారెట్లతో ఉండేది. ఆ తర్వాత దాన్ని కట్ చేశారు. 1849లో బ్రిటిషర్లు దాన్ని విక్టోరియా రాణికి అప్పగించారు. ఆమె దాన్ని పలు సందర్భాల్లో తన కిరీటంపై ధరించేవారు. ప్రస్తుతం ఇది లండన్ టవర్‌కి చెందిన జ్యువెల్ హౌస్ మ్యూజియంలో ఉంది. కోహినూర్ ప్రపంచంలోనే పురాతన, అత్యంత ప్రసిద్ధ వజ్రాలలో ఒకటి.
ఎల్గిన్ మార్బుల్స్
ఎల్గిన్ మార్బుల్స్ పురాతన గ్రీకు శిల్పాల సమాహారం. గ్రీస్‌లోని పార్థినాన్ నుంచి 1801–1805 సంవత్సరాల మధ్య బ్రిటిషర్లు ఎథీనా దేవతకు అంకితం చేసిన ఈ శిల్పాలను తీసుకెళ్లారు. ఈ శిల్పాలు గ్రీకుల గొప్పతనం, వారి వారసత్వం, చరిత్రను తెలుపుతాయి. 1453 నుండి దాదాపు 400 సంవత్సరాల పాటు ఒట్టోమన్ సామ్రాజ్యం గ్రీకును పాలించింది. ఆ సమయంలో బ్రిటిష్ రాయబారి లార్డ్ ఎల్గిన్, పారి్థనాన్ శిథిలాల నుంచి ఈ శిల్పాలను సేకరించి తీసుకెళ్లారని చెబుతారు.
బ్రెజిల్ రబ్బరు విత్తనాలు
బ్రెజిల్‌కే సొంతమైన హెవియా బ్రాసిలియెన్సిస్ (రబ్బరు చెట్టు) 70 వేల విత్తనాలను 1876లో బ్రిటిష్ యాత్రికుడు హెన్రీ విక్హామ్ దొంగిలించాడు. ఇది చరిత్ర గతిని మార్చిన ఘటనగా పేర్కొంటారు. బ్రెజిల్‌లోని శాంటారెమ్ ప్రాంతంలోని 140 అడుగుల ఎత్తుకు పెరిగిన రబ్బరు చెట్టు విత్తనాలవి. అప్పటివరకు రబ్బరు పరిశ్రమపై బ్రెజిల్‌కు ఉన్న ఆధిపత్యం ఈ ఘటనతో చెదిరిపోయింది. ఈ విత్తనాలు ప్రస్తుతం లండన్ మ్యూజియంలో ఉన్నాయి.
రోసెట్టా స్టోన్
ఈజిప్టులోని రోసెట్టా ప్రాంతంలో దొరికిన పురాతన శాసనం ఇది. ఈజిప్టును పాలించిన టోలెమీ 196 బీసీలో నల్లటి బసాల్ట్ గ్రానైట్ రాయిపై ఈ శాసనాన్ని చెక్కించారు. మూడు విభిన్న ఈజిప్టియన్ భాషల్లో రాసిన ఈ శాసనం తన సామ్రాజ్యం, తాను చేసిన పనుల గురించి ఇందులో రాయించారు. 1799లో ఈ రాయిని కనుగొన్నారు. నెపోలియన్ బోనపార్టీ ఈజిప్టు నుంచి దీన్ని స్వా«దీనం చేసుకున్నారు. 1800 సంవత్సరంలో ఫ్రెంచ్ సైన్యం ఓడిపోయిన తర్వాత బ్రిటిషర్లు దీన్ని స్వా«దీనం చేసుకుని బ్రిటన్‌కు తరలించారు. ప్రాచీన ఈజిప్టు సామ్రాజ్యం, గ్రీకుల సంస్కృతి, వారసత్వం గురించి తెలిపే అత్యంత విలువైన శాసనంగా దీన్ని పరిగణిస్తారు. అందుకే దీన్ని తిరిగి ఇవ్వాలని ఈజిప్టు దేశం బ్రిటన్‌ను కోరినా పట్టించుకోలేదు.
షాజహాన్ వైన్ జార్
మొఘల్ చక్రవర్తి షాజహాన్ వైన్ తాగే జార్‌ను కూడా బ్రిటిషర్లు తీసుకెళ్లి అక్కడి మ్యూజియంలో పెట్టుకున్నారు. తెల్లటి కప్పులా ఉండే ఈ జార్ దిగువ భాగంలో కమలం, ఆకులను పోలి ఉండేది. హ్యాండిల్‌పై కొమ్ము, గడ్డంతో ఉన్న జంతువు ఉండేది. 19వ శతాబ్దంలో ఈ అందమైన వైన్ జార్‌ను కల్నల్ చార్లెస్ సెటన్ గుత్రీ దొంగిలించి బ్రిటన్‌కు పంపినట్టు చెబుతారు. 1962 నుంచి ఇది లండన్‌లోని విక్టోరియా మ్యూజియంలో ఉంది.
బెనిన్ కాంస్యాలు
ఒకప్పటి బెనిన్ రాజ్యమే ఇప్పటి నైజీరియా. 1897లో బ్రిటిషర్లు బెనిన్‌పై దాడిచేసి ఆ నగరాన్ని దోచుకుంది. అక్కడి రాజ భవనంలో ఉన్న చారిత్రాత్మక వస్తువులు, 200కిపైగా కాంస్య ఫలకాలు ఇప్పుడు బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి. 1960లో స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి నైజీరియా పలుసార్లు ఈ కాంస్యాలను తిరిగి ఇవ్వాలని కోరినా ఫలితం లేదు.
ఇది కూడా చదవండి: ఒక ఇమ్రాన్.. రెండు కేసులు
Comments
Please login to add a commentAdd a comment