విమానం కూలిన ప్రాంతంలో సహాయక చర్యల్లో నిమగ్నమైన సిబ్బంది
• 37 మంది మృతి
• కిర్గిస్తాన్‌లో ప్రమాదం
• పైలట్ తప్పిదమేనన్న అధికారులు
డచాసు(కిర్గిస్తాన్): కిర్గిస్తాన్ రాజధాని బిషెక్ మనాస్ విమానాశ్రయం సమీపంలో జనావాసాలపై సోమవారం టర్కీ కార్గో విమానం కుప్పకూలింది. ఉదయం 7.30 గంటల ప్రాంతంలో దట్టమైన పొగమంచు కమ్మిన విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుం డగా ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో కనీసం 37 మంది మరణించారు. వీరిలో నలుగురు పైలట్లు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పైలట్ తప్పిదమే ప్రమాదానికి కారణమని ప్రాథమికవిచారణలో తేలినట్టు ఉప ప్రధాని ముహమ్మెత్కాలి అబుల్గాజీవ్ వెల్లడించారు.
టర్కీకి చెందిన యాక్ట్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 747–400 కార్గో విమానం హాంకాంగ్ నుంచి బిషెక్ మీదుగా ఇస్తాంబుల్ వెళుతోంది. పూర్తిగా పొగమంచుతో కప్పేసిన మనాస్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేసే క్రమంలో... పక్కనే ఉన్న డచాసు గ్రామంలోని ఇళ్లపై కుప్పకూలింది. విమాన శకలాలు విరిగి పడి... వాటి నుంచి పొగ, మంటలు చుట్టుపక్కల వ్యాపించాయి. ఈ ఘటనలో 17 ఇళ్లు పూర్తిగా ధ్వంసమైనట్టు అత్యవసర సేవల శాఖ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎల్మిరా షెరిపోవా తెలిపారు.
భయంతో పరుగులు...
ఇళ్లలో నిద్రిస్తుండగా పెద్ద శబ్దం రావడంతో తొలుత భూకంపం వచ్చిందని భావించామని, భయభ్రాంతులకు గురై పరుగెత్తుకుంటూ బయటకు వచ్చామని స్థానికులు తెలిపారు. తీరా చూస్తే చుట్టుపక్కల మంటలు కనిపించా యన్నారు. మండుతున్నవిమాన శకలం ఓ ఇంటిపై పడటంతో అందులో ఉంటున్న కుటుంబ సభ్యులంతా మృతిచెందారని ఆవేదనతో చెప్పారు. దీనిపై విచారణ చేపట్టేందుకు ప్రధాని సూరోన్‌బాయ్ జీన్‌బెకోవ్ ప్రత్యేక కమిషన్‌ను నియమించారు. అధ్యక్షుడు అల్మాజ్‌బెక్‌అటాంబయేవ్ తన చైనా పర్యటన రద్దు చేసుకుని కిర్గిస్తాన్‌కు తిరిగి వెళ్లారు. యాక్ట్ ఎయిర్‌లైన్స్, తయారీ సంస్థ బోయింగ్ ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశాయి. సోమవారం సాయంత్రం వరకు విమానాశ్రయం మూసి ఉంటుందని అధికారులుతొలుత ప్రకటించినా... ఉదయం ఘటన జరిగిన సమయంలో తెరిచే ఉండటం గమనార్హం.