బీజింగ్: చైనాలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 28 మంది మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. వాయువ్య చైనా గుయ్‌జోవ్ ప్రావిన్స్‌లోని ఓ గ్రామంలో శుక్రవారం పెద్ద కొండచరియ విరిగిపడి 20 మంది మృత్యువాత పడ్డారని అధికారులు వెల్లడించారు. మరో ఘటనలో మధ్య చైనాలోని హుబెయ్ ప్రావిన్స్‌లో ఉన్న వుహన్ గ్రామంలో శనివారం కురిసిన భారీ వర్షానికి ఓ పరిశ్రమ గోడ కూలి 8 మంది మృతి చెందారని స్థానిక అధికారులు చెప్పారు.
దఫాంగ్‌లోని పియాన్‌పో గ్రామంలో భారీ వర్షానికి కొండచరియ విరిగిపడి ముగ్గురు గల్లంతయ్యారు. దక్షిణ చైనాలో జూన్ 27 నుంచి వర్షాలు, తుఫానులు బీభత్సం సృష్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 34 మంది మృతిచెందారని ఆ దేశ పౌర వ్యవహారాల శాఖ వెల్లడించింది. నదులు ఉప్పొంగడం వల్ల రాత్రికి రాత్రి 12 వేల మందిని పునరావాస ప్రాంతాలకు తరలించామని హుబై ప్రావిన్స్ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.
‘దేశవ్యాప్తంగా 12 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 40 వేల మంది సహాయం కోసం వేచి చూస్తున్నారు. 3,600 ఇళ్లు కూలిపోయాయి. 19,900 హెక్టార్లలోని పంట నాశనమైంది’ అని చైనా ప్రభుత్వం వెల్లడించింది.
చైనాలో భారీ వర్షాలు.. 28 మంది మృతి
Published Sun, Jul 3 2016 8:28 PM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM
Advertisement
Advertisement