బాలికలను విడిచిపెడితే కన్యత్వం అర్పిస్తా.. | left the girls , give to virginity offered was Adokiye | Sakshi
Sakshi News home page

బాలికలను విడిచిపెడితే కన్యత్వం అర్పిస్తా..

Published Sat, Jun 28 2014 2:22 AM | Last Updated on Sat, Sep 2 2017 9:27 AM

బాలికలను విడిచిపెడితే కన్యత్వం అర్పిస్తా..

బాలికలను విడిచిపెడితే కన్యత్వం అర్పిస్తా..

నైజీరియా మిలిటెంట్లకు పాప్ గాయని సంచలన ప్రతిపాదన 
రోజుకు 12 మందితో శృంగారంలో పాల్గొనేందుకూ సిద్ధమేనని ప్రకటన

 
అబూజా: నైజీరియాలో ఆమె ఓ పాప్ సెన్సేషన్. తన అందచందాలతో, ఆటపాటలతో యువతను ఉర్రూతలెక్కించే యువ తరంగం. దీనికితోడు తమ దేశం తరఫున ఐక్యరాజ్య సమితి (ఐరాస) శాంతి పరిరక్షక అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. అలాంటి 23 ఏళ్ల అడోకియేను రెండు నెలల కిందట దేశంలో జరిగిన 276 మంది స్కూలు బాలికల కిడ్నాప్ ఉదంతం కలచి వేసింది. బొకో హరమ్ ఇస్లామిక్ మిలిటెంట్ల చెరలో బందీలుగా ఉన్న బాలికల విడుదల కోసం ప్రభుత్వం ఇప్పటివరకూ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం, చివరకు అమెరికా ‘ఫస్ట్ లేడీ’ మిషెల్ ఒబామా హాలీవుడ్ తారలతో కలిసి ఈ విషయంలో చేపట్టిన ప్రచారం కూడా సత్ఫలితాన్నివ్వకపోవడంతో ఆమె ఓ అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలికల విడుదల కోసం ఇస్లామిక్ మిలిటెంట్లకు సంచలన ప్రతిపాదన చేసింది. బాలికలను విడిచిపెడితే అందుకు ప్రతిగా తన కన్యత్వాన్ని అర్పించేందుకు సిద్ధమంటూ ప్రకటించింది. బందీలను విడిచిపెట్టి వారి స్థానంలో కావాలంటే తనను ఇష్టమొచ్చినట్లు వాడుకోవచ్చంటూ ప్రతిపాదించింది. ‘‘కిడ్నాప్‌కు గురైన బాలికలంతా అభంశుభం తెలియని అమాయకులు.

రెండు నెలలుగా తల్లిదండ్రులకు దూరమై ఎంతో మనోవేదన అనుభవిస్తున్నారు. వారంతా 12 నుంచి 15 ఏళ్ల వయస్కులు. నేను వారికన్నా వయసులో పెద్దదాన్ని. ఒకవేళ ప్రతి రాత్రీ 10-12 మంది మిలిటెంట్లు శృంగారం కోసం నన్ను తీసుకెళ్తానన్నా నేనేమీ పట్టించుకోను. దయచేసి ఆ బాలికలను విడిచిపెట్టి వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చండి’’ అంటూ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిలిటెంట్లకు అడోకియే విజ్ఞప్తి చేసింది. అయితే ఆమె ప్రతిపాదన నెట్‌లో దుమారం రేపింది. కొందరు నెటిజన్లు ఆమె తెగువను మెచ్చుకోగా మరికొందరేమో ఆమె వ్యాఖ్యలను ప్రచార గిమ్మిక్కుగా అభివర్ణించారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement