లైట్లతో నిద్రలేమి..
న్యూయార్క్: కాలుష్యం చాలా రకాలు. ప్రపంచానికి పెద్ద సవాల్ గా మారింది. కాంతి కాలుష్యం కూడా ఈ కోవలో చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద నగరాలలో ఇదో సమస్యగా మారింది. రాత్రి వేళల్లో లైట్ల వల్ల చాలా మంది నిద్ర లేకుండా గడుపుతున్నారని ఓ సర్వేలో తేలింది. దీని ప్రభావం మరుసటి రోజు పని మీద పడుతుందని పేర్కొంది.
గ్రామీణ ప్రాంతాలు, చిన్ని పట్టణాలతో పోలిస్తే నగరాల్లో నివసించే వారిలో ఈ సమస్య మూడు నుంచి ఆరు రెట్లు ఎక్కువగా ఉందని వెల్లడైంది. కాలిఫోర్నియాకు చెందిన స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ వర్సిటీ బృందం 15,863 మందిని 8 ఏళ్ల పాటు అధ్యయనం చేసింది. వారి నిద్ర అలవాట్లు, మానసిక స్థితి వంటి అంశాలను తెలుసుకున్నారు. ఈ అధ్యయనంలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. లైట్ల ప్రభావం ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లో నిద్ర లేమి సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నట్లు గుర్తించారు. దీనివల్ల పగలు పనిలో త్వరగా అలసిపోవడంతో పాటు నిద్రమత్తులో ఉంటున్నారని వెల్లడించారు. ‘పస్తుత సమాజంలో 24/7 ఉద్యోగాలు వచ్చేశాయి. భద్రత కోసం వీధుల్లో పెద్ద పెద్ద లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. భద్రత సంగతి అలా ఉంచితే వీటి వల్ల చాలా మందికి నిద్రలేమి వస్తోంది. కాంతి కాలుష్యం వల్ల భవిష్యత్తులో అనేక ప్రమాదాలు జరుగనున్నాయి’ అని స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ పరిశోధకుడు మారిస్ హయాన్ తెలిపారు. ఈ నివేదికను వచ్చే ఏఫ్రిల్‌లో కెనడాలోని వాంకోవర్‌లో జరిగే అమెరికన్ ఎకాడమీ ఆఫ్ న్యూరాలజీ సంస్థ 68వ వార్షిక సమావేశంలో సమర్పించనున్నారు.