నీరవ్ మోదీ
లండన్ / న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ)కు రూ.13,500 కోట్ల కుచ్చుటోపీ పెట్టిన కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(48)కి లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు మరోసారి షాకిచ్చింది. బెయిల్ కోసం నీరవ్ మోదీ రెండోసారి దాఖలుచేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి ఎమ్మా అర్బత్‌నాట్ శుక్రవారం తిరస్కరించారు. నీరవ్‌కు ఒకవేళ బెయిల్ మంజూరుచేస్తే ఆయన బ్రిటన్ విడిచి పారిపోతారని చెప్పడానికి గట్టి సాక్ష్యాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. భారత్‌లో ఈ కేసు విచారణ సాగుతుండగానే నీరవ్ 2017లో వనౌతు అనే పసిఫిక్ ద్వీప దేశపు పౌరసత్వం పొందేందుకు చేసిన ప్రయత్నాలను ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రస్తావించారు. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్ 26కు వాయిదా వేసిన ఎమ్మా.. ఈసారి వాండ్స్‌వర్త్‌లోని హర్ మేజిస్టీ జైలు నుంచి వీడియో లింక్ ద్వారా నీరవ్‌ను విచారిస్తామని స్పష్టం చేశారు.
రేడియో ట్యాగ్‌కు ఒకే..
భారత న్యాయవాదుల వాదనల్ని నీరవ్ న్యాయవాది ఖండించారు. నీరవ్ తరఫున బారిస్టర్ క్లేర్ మాంట్‌గోమెరీ వాదనలు వినిపిస్తూ..‘నీరవ్ బ్రిటన్‌ను స్వర్గంగా భావిస్తున్నారు. బ్రిటన్‌లోనే తనకు న్యాయం జరుగుతుందని ఆయన నమ్ముతున్నారు. మా క్లయింట్‌కు బ్రిటన్‌ను విడిచిపెట్టి వెళ్లే ఉద్దేశం లేదు. బెయిల్ మంజూరు చేస్తే నీరవ్ కదలకల్ని గుర్తించేందుకు వీలుగా ఆయనకు రేడియో ట్యాగ్ అమర్చేందుకు మేం సుముఖంగా ఉన్నాం’ అని వెల్లడించారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి ఎమ్మా అర్బత్‌నాట్.. ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే నీరవ్ మోదీ పారిపోతారని చెప్పేందుకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ పిటిషన్‌ను తిరస్కరించారు. మరోవైపు ఈ విచారణకు హాజరైన సీబీఐ–ఈడీ అధికారుల బృందం కొత్త సాక్ష్యాలను కోర్టుకు సమర్పించింది. అంతకుముందు ఒకవేళ నీరవ్‌ను అప్పగిస్తే ఏ జైలుకు తరలిస్తారని న్యాయమూర్తి భారత న్యాయవాదిని ప్రశ్నించారు. దీంతో లిక్కర్‌కింగ్ విజయ్‌మాల్యాను ఉంచాలని భావిస్తున్న ఆర్థర్ రోడ్ జైలుకే నీరవ్‌ను తరలిస్తామని ఆయన జవాబిచ్చారు. ఆర్థర్‌రోడ్ జైలు వీడియోను తాను చూశాననీ, అక్కడ గదిలో ఇద్దరికీ సరిపడా స్థలం ఉందని జడ్జి ఎమ్మా వ్యాఖ్యానించారు.
అధికారిపై వేటు.. ఉపసంహరణ
నీరవ్ మోదీ కేసులో ఈడీ విచారణాధికారి(ఐఓ) అయిన జాయింట్ డైరెక్టర్ సత్యబ్రత్ కుమార్‌ను ఆ బాధ్యతల నుంచి శుక్రవారం తప్పించడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. కుమార్ లండన్ పర్యటనలో ఉండగానే ఈడీ పశ్చిమజోన్ ప్రత్యేక డైరెక్టర్ వినీత్ అగర్వాల్ ఈ ఉత్తర్వులను జారీచేశారు. ఈ వార్త మీడియాలో వైరల్ కావడంతో ఈడీ డైరెక్టర్ సంజయ్ మిశ్రా ఈ ఉత్తర్వుల్ని నిమిషాల్లోనే రద్దుచేశారు.ఈడీ నిబంధనల మేరకు ఓ అధికారి ఐదేళ్లకు మించి ఒకే పోస్టులో కొనసాగరాదనీ, అదే సమయంలో కుమార్ పదవీకాలాన్ని పొడిగించాలని తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని మిశ్రా తెలిపారు.
సాక్షుల్ని చంపేస్తామని బెదిరించారు
లండన్‌లోని కోర్టుకు నీరవ్ మోదీ మడతలు పడ్డ తెలుపురంగు చొక్కాతో శుక్రవారం వచ్చారు. ఈ సందర్భంగా భారత్ తరఫున క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్(సీపీఎస్) న్యాయవాది టోబీ కాడ్మన్ వాదిస్తూ..‘నీరవ్‌కు మోదీకి బెయిల్ మంజూరుచేస్తే ఆయన న్యాయప్రక్రియకు విఘాతం కల్గించడంతో పాటు దేశం విడిచి పారిపోయే ప్రమాదముంది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులను నీరవ్ ఇప్పటికే ఫోన్‌లో బెదిరించారు. స్మార్ట్‌ఫోన్లతో పాటు సర్వర్లలో ఉన్న కీలక సాక్ష్యాలను ధ్వంసం చేయించారు. పీఎన్‌బీని రూ.13,500 కోట్ల మేర మోసం చేసిన కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఆశిష్ లాడ్‌ను చంపేస్తామని నీరవ్ ఫోన్‌లో బెదిరించారు. ఒకవేళ తన వాంగ్మూలం మార్చుకుంటే రూ.20 లక్షలు లంచం ఇస్తానని ఆశచూపారు. ఇదే కేసులో సాక్షులుగా ఉన్న నీలేశ్ మిస్త్రీ, మరో ముగ్గురిని ఇదే తరహాలో భయపెట్టారు’ అని కోర్టుకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment