ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం ఏదో తెలుసా?
ముంబై: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో లండన్ మొదటి స్థానంలో నిలిచింది. ప్రముఖ బ్రిటన్ రియల్ ఎస్టేట్ సంస్థ సవిల్స్ నిర్వహించిన సర్వేలో లండన్ తరువాతి స్థానాల్లో న్యూయార్క్, హాంకాంగ్ నగరాలు నిలిచాయి. ఈ టాప్ ట్వంటీ ఖరీదైన నగరాల జాబితాలో భారత్ నుంచి ఏకైక నగరం ముంబై 17వ స్థానంలో నిలిచింది. ముంబై తరువాతి స్థానాల్లో బెర్లిన్, జొహనెస్బర్గ్, రియోడీజెనీరో నగరాలు ఉన్నాయి. ఈ సర్వేలో ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లోని కార్యాలయాలు, నివాసస్థలాలకు గల అద్దె ఖర్చులను లెక్కలోకి తీసుకున్నారు.
లండన్లో అత్యధికంగా ఒక వ్యక్తికి సంవత్సరానికి సుమారు 76 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నట్లు సర్వే వెల్లడించింది. గత ఐదేళ్లలో లండన్లో ఈ ఖర్చులు 18 శాతం పెరిగినట్లు సవిల్స్ వరల్డ్ రీసెర్చ్ నిర్వహించిన సర్వేకు నేతృత్వం వహించిన బార్నెస్ తెలిపారు. ప్రపంచ నగరాలు సాధిస్తున్న ఆర్థక ప్రగతే.. అక్కడ పెరిగిపోతున్న అద్దెలకు ప్రధాన కారణమౌతోందని, అలాంటి చోట్ల సామాన్య ప్రజానికానికి ఇంటి అద్దెలను భరించటం సమస్యగా మారిందని ఆమె వెల్లడించారు. ఒక నగరానికి సంబంధించిన ఉత్పాదకత, ప్రపంచ వాణిజ్యంపై నేరుగా ప్రభావం చూపించేలా ఉంటే అక్కడ అద్దె ఖర్చులు పెరుగుతున్నట్లు సర్వేలో తేలింది.