
సూర్యుని సూపే.. సూది మందు! అవును రెప్పవేయకుండా కొన్ని క్షణాలు ఉదయిస్తున్న బాల సూర్యున్ని లేదా అస్తమిస్తున్న పండు సూర్యున్ని చూడండి చాలు.. అన్ని రోగాలూ మాయమవుతాయని అంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన ‘ఇన్‌స్టాగ్రామ్ వెల్‌నెస్ గురు’ పేట్ ఈవెన్స్. ఆయన చెప్పే హెల్త్ టిప్స్‌కు ఫిదా అవుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ (2 లక్షల మంది) అమాంతం పెరగడంతో ఇటీవల ఆయన ఓ సెలబ్రిటీ అయ్యారు. ‘నేను రోజూ సముద్రంలో మునిగి.. ఉదయం, లేదా సాయంత్రం వేళల్లో సూర్యున్ని రెప్పవాల్చకుండా చూస్తూ లీనమైపోతాను. ఉచితంగా శరీరానికీ, మెదడుకూ, ఆత్మకూ కావాల్సిన మెడిసిన్‌ను అందించడానికి ఈ భూమిపై ఉన్న అత్యంత శక్తివంతమైన పద్ధతిది’ అని పేట్ గతనెల 16న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
గతంలో పాలే డైట్‌కు మద్దతు ప్రకటించడం, సన్‌స్క్రీన్ లోషన్స్‌ను విషపూరితాలని, సమాజంలో అన్ని సమస్యలకూ ఫ్లోరైడ్ నీరే కారణమని చెబుతూ పేట్ పోస్టులు పెట్టి వైద్యుల నుంచి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. సూర్యుడి చిట్కాను కూడా వైద్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎండకు నిలబడితే ఓకే కానీ, నేరుగా కొన్ని సెకండ్ల పాటు సూర్యున్ని చూస్తే కళ్లు కోలుకోలేనంతగా పాడవుతాయని హెచ్చరిస్తున్నారు. అతని సూచన పాటించడం రిస్క్ అని, అయినా పాటిస్తామంటే మీ ఇష్టమని వారు సూచిస్తున్నారు.