రూ. 320 కోట్లను ఉతికేసింది!
ఈనెల తొమ్మిదో తేదీన బ్రిటన్‌లో ఓ లాటరీ డ్రా తీశారు. ప్రైజ్‌మనీ మొత్తం దాదాపు రూ. 640 కోట్లు. ఇందులో సగం డేవిడ్, కరోల్ మార్టిన్ అనే దంపతులు గెలుచుకున్నారు. వారు తమ టిక్కెట్ చూపించి... ప్రైజ్‌మనీ చెక్కును అందుకున్నారు కూడా. అయితే మరో సగాన్ని అంటే దాదాపు రూ. 320 కోట్ల రూపాయలను గెల్చుకున్నదెవరనేది తేలలేదు. పదిరోజులు గడిచిపోయినా ఎవరూ ముందుకు రాకపోయేసరికి లాటరీ నిర్వాహకులు విచారణ జరిపితే... 26, 27, 46, 47, 52, 58 నెంబర్లతో ఉన్న విన్నింగ్ టికెట్‌ను వర్సెస్టర్‌లో అమ్మారని తేలింది.
వార్డన్ శివార్లలో ప్రవాసభారతీయుడు నాథు పటేల్‌కు చెందిన షాపులో ఎవరో ఈ టిక్కెట్టు కొన్నారు. చుట్టుపక్కల నివసించే వారు తమ టిక్కెట్లను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోమని లాటరీ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. దాంతో ఓ మహిళ తాను కొన్న లాటరీ టిక్కెట్టు కోసం వెతికింది. చివరికది ఉతికి ఆరేసిన జీన్స్ ప్యాంటు జేబులో దొరికింది.
టిక్కెట్టు తీసి చూస్తే విన్నింగ్ నంబర్లు సరిపోయాయి. అంతే ఆమె కాళ్లు వణకడం మొదలైంది. ఎందుకంటే నెంబర్లు, సంవత్సరం సరిగానే కనపడుతున్నా లాటరీ తేదీ, బార్‌కోడ్, సీరి యల్ నెంబర్ చెరిగిపోయాయట. ఆమె వెంటనే పటేల్ షాపునకు పరుగెట్టింది. లాటరీ నిర్వాహకుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ప్రైజ్‌మనీ ఇస్తారో? ఇవ్వరో? తెలియక ఇప్పుడామె నిద్రలేని రాత్రులు గడుపుతోంది. పేరు బయటపెట్టడానికి ఇష్టపడని ఈమె వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని ఉతికేసి చేజార్చుకున్నట్లే కనపడుతోంది!