Prize Money Cheque
-
భారత మహిళా క్రికెటర్లకు ‘ఆ మొత్తం’ అందనేలేదు
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా వేదికగా గత సంవత్సరం జరిగిన టి20 ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత మహిళల జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఐదు లక్షల డాలర్ల ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంది. అయితే 14 నెలలు పూర్తయినా... రన్నరప్ ప్రైజ్‌మనీ ఇప్పటికీ భారత మహిళా క్రికెటర్ల చేతికందనేలేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రన్నరప్ ప్రైజ్‌మనీ మొత్తం 5 లక్షల డాలర్లను (రూ. 3 కోట్ల 64 లక్షలు) భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి గత సంవత్సరం ఏప్రిల్‌లోనే అందజేసినప్పటికీ బోర్డు మాత్రం అమ్మాయిలకు ఆ మొత్తాన్ని ఇప్పటిదాకా ఇవ్వనే లేదు. మహిళా క్రికెటర్లపై బోర్డు శీతకన్నుకు ఇదో నిదర్శనమనే విమర్శలు వస్తున్నాయి. ఏదైనా ఐసీసీ టోర్నమెంట్ ముగిసిన ఏడు రోజుల్లోనే ఐసీసీ ప్రైజ్‌మనీ నిధుల్ని ఆయా దేశాల బోర్డులకు పంపిస్తుంది. అయితే సంబంధిత దేశాల బోర్డులే తమ జట్లకు పంపిణీ చేయాలి. నిధులందిన రెండు వారాల్లోపే అమ్మాయిలకు పంపిణీ చేయాల్సి ఉన్నా బీసీసీఐ మాత్రం ఖజానాలోనే అట్టిపెట్టుకుంది. క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టుకు గత సంవత్సరం ఏప్రిల్‌లో... ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ జట్టుకు గత ఏడాది మేలోనే ప్రైజ్‌మనీని పంపిణీ చేశాయి. వారం రోజుల్లో ఇస్తాం: బీసీసీఐ బ్రిటన్ దినపత్రికలో వచ్చిన ఈ కథనం, దరిమిలా విమర్శలపై బోర్డు స్పందించింది. ఇంతవరకు అమ్మాయిలకు ప్రైజ్‌మనీ మొత్తాన్ని పంపిణీ చేయకపోవడం నిజమేనని అంగీకరించిన బోర్డు వారం రోజుల్లో దానిని మహిళా క్రికెటర్లకు ఇస్తామని తెలిపింది. ‘కరోనా కారణంగా ఈ ఒక్క ప్రైజ్‌మనీయే కాదు... పురుషుల, మహిళల కాంట్రాక్టు ఫీజులు, దేశవాళీ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులు, వార్షిక చెల్లింపులు అన్నీ ఆలస్యమే అవుతున్నాయి’ అని బోర్డు సీనియర్ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు. -
చేత కాకపోతే చెప్పండి: ఏషియన్ గేమ్స్ విజేత
సాక్షి, లక్నో: క్రీడాకారులు పతకాలు సాధించిన వెంటనే.. ప్రభుత్వాలు వారిపై వరాల జల్లు కురిపిస్తాయి. కొద్ది రోజులపాటు మీడియాలో హడావుడి చేసి, కావాల్సిన పబ్లిసిటి వచ్చాక అసలు విషయాన్ని మరిచిపోతాయి. ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగం, నగదు కోసం క్రీడాకారులు పోటీల్లో పరుగులు తీసినట్టు ఆఫీసుల చుట్టు పరుగులు తీస్తుంటారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితే ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వెటరన్ లాంగ్ డిస్టెన్స్ రన్నర్ సుధా సింగ్‌కు ఎదురైంది. ఆసియా గేమ్స్ 2018లో రజతం సాధించిన ఈ క్రీడాకారిణికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ముప్పై లక్షల నగదుతో పాటు, క్రీడా శాఖలో అత్యున్నత ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. తాజాగా మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం యోగితో పాటు ఆ రాష్ట్ర గవర్నర్ రామ్ నాయక్ సుధాకు 30 లక్షల చెక్‌ను అందచేయగా.. ఆమె తిరస్కరించారు. తనకు కావాల్సింది డబ్బు కాదని ఉద్యోగమని సభా వేదికగా డిమాండ్ చేశారు. అనంతరం అధికారులు, యోగి బుజ్జగించాక చెక్ తీసుకున్నారు. కానీ ఉద్యోగం ఇవ్వకపోతే చెక్ వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటించారు. గతంలో కూడా.. 2015లో కూడా అప్పటి ప్రభుత్వం క్రీడా శాఖలో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి సీఎంను మూడు సార్లు కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆగ్రహించారు. తాను రైల్వే శాఖలో మంచి ఉద్యోగం చేస్తున్నప్పటికీ రాష్ట్ర క్రీడా శాఖలో ఉద్యోగం చేయాలనే కోరిక ఉందని, యువ ఆటగాళ్లకు చేయుతనివ్వాలనే ఉద్దేశంతోనే ఆ ఉద్యోగాన్ని కోరుకుంటున్నానని తెలిపారు. క్రీడాకారుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపడం సరికాదన్నారు. తనకు ఇచ్చిన నగదును యువ క్రీడాకారుల శిక్షణ కోసం ఖర్చు చేస్తానని పేర్కొన్నారు. ఇవ్వడం సాధ్యం కాకపోతే చెప్పండి.. తనకు క్రీడా శాఖలో ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు చెబితే తను వేరే ప్రత్యామ్నాయం చూసుకుంటానని, యూపీ నుంచి ప్రాతినిథ్యం వహించబోనని స్పష్టం చేశారు. తొమ్మిది సార్లు జాతీయ చాంపియన్, ఆసియన్ గేమ్స్‌లో బంగారు, రజత పతకాలు, అర్జున అవార్డు సాధించిన తాను ప్రభుత్వ ఉద్యోగానికి పనికిరానా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చదవండి: సుధా సింగ్‌కు యూపీ ప్రభుత్వ ఉద్యోగం -
రూ. 320 కోట్లను ఉతికేసింది!
ఈనెల తొమ్మిదో తేదీన బ్రిటన్‌లో ఓ లాటరీ డ్రా తీశారు. ప్రైజ్‌మనీ మొత్తం దాదాపు రూ. 640 కోట్లు. ఇందులో సగం డేవిడ్, కరోల్ మార్టిన్ అనే దంపతులు గెలుచుకున్నారు. వారు తమ టిక్కెట్ చూపించి... ప్రైజ్‌మనీ చెక్కును అందుకున్నారు కూడా. అయితే మరో సగాన్ని అంటే దాదాపు రూ. 320 కోట్ల రూపాయలను గెల్చుకున్నదెవరనేది తేలలేదు. పదిరోజులు గడిచిపోయినా ఎవరూ ముందుకు రాకపోయేసరికి లాటరీ నిర్వాహకులు విచారణ జరిపితే... 26, 27, 46, 47, 52, 58 నెంబర్లతో ఉన్న విన్నింగ్ టికెట్‌ను వర్సెస్టర్‌లో అమ్మారని తేలింది. వార్డన్ శివార్లలో ప్రవాసభారతీయుడు నాథు పటేల్‌కు చెందిన షాపులో ఎవరో ఈ టిక్కెట్టు కొన్నారు. చుట్టుపక్కల నివసించే వారు తమ టిక్కెట్లను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోమని లాటరీ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. దాంతో ఓ మహిళ తాను కొన్న లాటరీ టిక్కెట్టు కోసం వెతికింది. చివరికది ఉతికి ఆరేసిన జీన్స్ ప్యాంటు జేబులో దొరికింది. టిక్కెట్టు తీసి చూస్తే విన్నింగ్ నంబర్లు సరిపోయాయి. అంతే ఆమె కాళ్లు వణకడం మొదలైంది. ఎందుకంటే నెంబర్లు, సంవత్సరం సరిగానే కనపడుతున్నా లాటరీ తేదీ, బార్కోడ్, సీరి యల్ నెంబర్ చెరిగిపోయాయట. ఆమె వెంటనే పటేల్ షాపునకు పరుగెట్టింది. లాటరీ నిర్వాహకుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ప్రైజ్‌మనీ ఇస్తారో? ఇవ్వరో? తెలియక ఇప్పుడామె నిద్రలేని రాత్రులు గడుపుతోంది. పేరు బయటపెట్టడానికి ఇష్టపడని ఈమె వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని ఉతికేసి చేజార్చుకున్నట్లే కనపడుతోంది!