
900 ఏళ్లలో తొలిసారిగా ఓ మహిళ...
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ... ప్రపంచంలోని అత్యంత ప్రఖ్యాతిగాంచిన అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో ఒకటి.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ... ప్రపంచంలోని అత్యంత ప్రఖ్యాతిగాంచిన అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో ఒకటి. వందల ఏళ్ల పురాతనమైనది. అలాంటి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి 900 ఏళ్లలో తొలిసారిగా ఓ మహిళ వైస్ చాన్సలర్‌గా నియమితురాలయ్యారు. 56 ఏళ్ల లూయిస్ రిచర్డ్‌సన్ ఈ ఘనతను సాధించారు. ఉగ్రవాదం, అంతర్జాతీయ భద్రత అంశాల్లో ప్రపంచంలోనే సాధికారత కలిగిన వ్యక్తిగా ఆమెకు పేరు. వివిధ దేశాల్లో చట్టసభ సభ్యులకు ఈ అంశాలపై నిష్ణాతురాలైన ఆమె అవగాహన కల్పించడమే కాకుండా... పలు సూచనలు కూడా చేస్తుంటారు. జనవరి 1న ఆమె ఆక్స్‌ఫర్డ్ వీసీగా నియమితురాలైనప్పటికీ 12వ తేదీన అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఐర్లాండ్‌లోని తీరప్రాంత పట్టణమైన ట్రాన్‌మోర్‌లో ఓ సేల్స్‌మన్ ఏడుగురి సంతానంలో లూయిస్ రిచర్డ్‌సన్ అందరికంటే పెద్దవారు. డబ్లిన్‌లోని ట్రినిటీ కాలేజీ నుంచి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. డిగ్రీ చేసే సమయంలో లైబ్రరీలో సహా యకురాలిగా, బార్‌లో వెయిట్రెస్‌గా పనిచేస్తూ తన చదువుకు కావాల్సిన డబ్బును సమకూర్చుకునేవారు. చదువే ఆమె లోకం. కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి రాజనీతి శాస్త్రంలో ఎంఏ చేశారు. ప్రభుత్వ పాలన సబ్జెక్టుగా హార్వర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశారు. అనంతరం పీహెచ్‌డీ చేశారు. 1981 నుంచి 2001 దాకా 20 ఏళ్లపాటు హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు.
అంతర్జాతీయ సంబంధాలు.. ముఖ్యంగా ఉగ్రవాదం, అంతర్జాతీయ భద్రత, అమెరికా విదేశాంగ విధానం... తులనాత్మక అధ్యయనం... అనే అంశాలపై ఎక్కువగా దృష్టి సారించేవారు. తద్వారా ప్రపంచం నలుమూలలా పెచ్చరిల్లుతున్న ఉగ్రవాదం... వాటి మూలాలు, ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లు తదితర అంశాలపై సాధికారత సాధించారు. హార్వర్డ్ యూనివర్సిటీలో రాడ్‌క్లిఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీకి ఏడున్నరేళ్లు ఎగ్జిక్యూటివ్ డీన్‌గా పనిచేశారు. 2009లో బ్రిటన్‌లోని సెయింట్ అండ్రూస్ యూనివర్సిటీకి వైస్ చాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టారు. పూర్వ విద్యార్థులు, అభిమానుల నుంచి 500 కోట్ల రూపాయల మేర నిధులు సమీకరించి యూనివర్సిటీలోని సదుపాయాలను ఆధునీకరించారు. ఆమె సారథ్యంలో సెయింట్ అండ్రూస్ యూనివర్సిటీ బ్రిటన్‌లో మూడో అత్యుత్తమ వర్సిటీగా నిలిచింది. ఆమె పలు రచనలు కూడా చేశారు. 2006లో ప్రచురితమైన ‘వాట్ ద టైస్ట్స్ వాంట్: అండర్‌స్టాడింగ్ ద ఎనిమీ, కంటెయినింగ్ ద థ్రెట్’ అనే పుస్తకం బాగా ప్రాచుర్యం పొందింది. డాక్టర్ థామస్ జెవాన్‌ను పెళ్లాడారు. వీరికి ముగ్గురు సంతానం.
-సెంట్రల్ డెస్క్