కౌలాలంపూర్ : జమ్మూ కశ్మీర్‌పై తాను చేసిన వ్యాఖ్యలను కట్టుబడి ఉన్నానని మలేషియా ప్రధాని మహతీర్ మహ్మద్ స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి సూచించిన పరిష్కారాలను అగ్రరాజ్యం అమెరికా సహా భారత్, పాకిస్తాన్ వంటి ప్రతీ దేశం స్వాగతించి తీరాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఐరాస 74వ సర్వసభ్య సమావేశం సందర్భంగా న్యూయార్క్‌లో ప్రసంగించిన మహతీర్.. కశ్మీర్‌ను ఆక్రమిత ప్రాంతంగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఐరాస తీర్మానాలకు వ్యతిరేకంగా కశ్మీరీ లోయ దురాక్రమణకు గురైందని.. ఇది చాలా తప్పుడు చర్య అని పేర్కొన్నారు. శాంతియుత చర్చలతోనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. అయితే జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో మహతీర్ ఈ వ్యాఖ్యలు చేయడంపై భారత విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ మాట్లాడుతూ... మలేషియా ప్రధాని మహతీర్ వ్యాఖ్యలు విచారకరమని పేర్కొన్నారు. భారత్- మలేషియాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని.. అయితే ఆ దేశ ప్రధాని మాత్రం అసత్యాలను అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించడం బాగాలేదని విమర్శించారు. ఇక ఈ విషయంపై మంగళవారం స్పందించిన మహతీర్.. కశ్మీర్‌పై తన మనసులో ఉన్న కచ్చితమైన అభిప్రాయాన్ని వెల్లడించానని.. దానిని ఎవరికోసమో మార్చుకునేది లేదని స్పష్టం చేశారు. ‘ఇతర దేశాలతో ఉన్న దౌత్యపరమైన సంబంధాలను కాపాడుకోవడంతో పాటు అక్కడి ప్రజలతో కూడా స్నేహంగా ఉండాలని మేము భావిస్తున్నాం. మాది వాణిజ్య అనుకూల దేశం. అందుకే అతిపెద్ద మార్కెట్ల కోసం అన్వేషిస్తాం. అంతమాత్రాన ప్రజల పక్షాన మాట్లాడేందుకు మేము వెనకడుగువేయం. అయినా నిజాలు మాట్లాడినపుడు కొంత మంది స్వాగతిస్తారు. మరికొంత మంది వ్యతిరేకిస్తారు’ అని పేర్కొన్నారు. అదే విధంగా కశ్మీర్‌పై తన వ్యాఖ్యల నేపథ్యంలో మలేషియా పామ్ ఆయిల్‌ను కొనుగోలు చేయకూడదని ముంబైకి చెందిన ప్రముఖ ఆయిల్ ప్రాసెసర్ సంస్థలు నిర్ణయించిన విషయంపై కూడా ఆయన స్పందించారు. ప్రస్తుతానికి తాను ఈ విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ దృష్టికి తీసుకువెళ్లాలని భావించడం లేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment