Mahathir Mohamad
-
ఫ్రాన్స్‌ను ముస్లింలు శిక్షించవచ్చు
పారిస్: ఫ్రాన్స్‌ను శిక్షించే అధికారం ముస్లింలకు ఉందంటూ మలేసియా మాజీ ప్రధానమంత్రి మహథిర్ మహ్మద్ చేసిన ట్వీట్ తీవ్ర సంచలనానికి తెరతీసింది. ఆయన శుక్రవారం తన ట్విట్టర్ ఖాతా నుంచి వరుసగా 13 ట్వీట్లు చేశారు. ‘‘ఫ్రాన్స్ గతంలో నరమేధం సాగించింది. అందుకు ప్రతీకారంగా లక్షలాది మంది ఫ్రెంచ్ పౌరులను హతమార్చే అధికారం ముస్లింలకు ఉంది. కానీ, కంటికి కన్ను అనే సిద్ధాంతాన్ని ముస్లింలు పాటించరు. ఫ్రాన్స్ కూడా అందుకు కట్టుబడి ఉండాలి. ఇతర మతస్తుల మనోభావాలను గౌరవించడం ఫ్రాన్స్ ప్రజలకు అక్కడి ప్రభుత్వం నేర్పాలి’’అని ఒక ట్వీట్లో పేర్కొన్నారు. ఇది సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది. మహథిర్ మహ్మద్‌పై నెటిజన్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఫ్రాన్స్ డిజిటల్ సెక్టార్ సెక్రెటరీ సెడ్రిక్ ఓ వెంటనే రంగంలోకి దిగారు. మహథిర్ చేసిన ట్వీట్‌ను తక్షణమే తొలగించాలని ట్విట్టర్ యాజమాన్యాన్ని కోరారు. దీంతో ట్విట్టర్ యాజమాన్యం మహథిర్ మహ్మద్ ట్వీట్‌ను తొలగించింది. చర్చి ఘటనలో మరొకరి అరెస్టు నైస్(ఫ్రాన్స్): ఫ్రాన్స్‌లో నైస్ నగరంలోని చర్చిలో జరిగిన నరమేధంపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ట్యునీషియాకు చెందిన ఇబ్రహీం ఇస్సాయ్ అనే ముష్కరుడు చర్చిలో కత్తితో దాడి చేయడంతో ముగ్గురు పౌరులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో సంబంధం ఉందని అనుమానిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 47 ఏళ్ల ఈ అనుమానితుడు కత్తితో దాడి చేసిన ముష్కరుడితో అంతకు మందు రోజు రాత్రే మాట్లాడినట్లు తెలుస్తోంది. -
మలేసియా ప్రధాని అనూహ్య రాజీనామా
కౌలాలంపూర్: మలేసియా ప్రధానమంత్రి అనూహ్యంగా పదవినుంచి తప్పుకున్నారు. ప్రధాని మహతీర్ మొహమాద్ (94)తన రాజీనామాను ఆ దేశ రాజుకు సమర్పించినట్టు సమాచారం. దీనిపై స్పందించడానికి ఆ దేశ ప్రధానమంత్రి కార్యాలయం తిరస్కరించినప్పటికీ త్వరలో ప్రకటన విడుదల చేయనున్నట్టు మాత్రం వెల్లడించారు. ఇటీవల నెలకొన్ని రాజకీయ సంక్షోభం, త్వరలో కొత్త సంకీర్ణాన్ని ఏర్పాటుచేయనున్నారన్న అంచనాల మధ్య ప్రధాని రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది. 2018, మేలో మలేసియా మహతీర్ ప్రధానిగా రెండవసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. కాగా కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, ఇటీవల భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై ప్రధాని మహాతిర్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. JUST IN: PM @chedetofficial has just sent his resignation letter to the King, after a day of political turmoil in Malaysia. A press statement is to be issued soon. — TheMalaysianInsight (@msianinsight) February 24, 2020 -
భారత్‌తో విభేదాలు తాత్కాలికమే: మలేషియా
కౌలాలంపూర్: వాణిజ్యపరంగా భారత్‌తో తలెత్తిన విభేదాలు త్వరలోనే సమసిపోతాయని మలేషియా పరిశ్రమల శాఖ మంత్రి థెరిసా కోక్ పేర్కొన్నారు. మలేషియా పామాయిల్ ఉత్పత్తులపై భారత్ విధించిన నిషేధం తాత్కాలికమైందని భావిస్తున్నట్లు తెలిపారు. గత కొన్ని నెలలుగా భారత ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలను మలేషియా ప్రధాని మహతీర్ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. కశ్మీర్‌ను ఆక్రమిత ప్రాంతంగా పేర్కొన్న ఆయన.. ఆర్టికల్ 370 రద్దు విషయంలో భారత్‌పై విమర్శలు గుప్పించారు. అదే విధంగా ఇటీవల నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో ప్రపంచంలోనే పామాయిల్ అతిపెద్ద దిగుమతిదారుగా ఉన్న భారత్... మలేషియా పామాయిల్‌ను కొనుగోలు చేయకూడదని నిర్ణయించింది. మలేషియాకు బదులు ఇండోనేషియా నుంచి పామాయిల్‌ను దిగుమతి చేసుకోవాలని సంబంధిత వ్యాపార సంస్థలకు సూచించింది. దీంతో వాణిజ్యపరంగా మలేషియాకు తీవ్ర నష్టం కలుగుతోంది. ఈ నేపథ్యంలో మలేషియా మంత్రి థెరిసా కోక్ మంగళవారం మాట్లాడుతూ.. ‘‘భారత్- మలేషియాల మధ్య సుదీర్ఘకాలంగా ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను ఇరు దేశాలు అధిగమిస్తాయని భావిస్తున్నాం. పరస్పర ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని ఆకాంక్షిస్తున్నాం. పామాయిల్ కొనుగోలుపై భారత్ నిర్ణయం తాత్కాలికమే అని భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. అదే విధంగా.. బీ20 బయోడీజిల్ విధానాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకువస్తామని... తద్వారా పామాయిల్ ధరలు నిలకడగా ఉంటాయని అభిప్రాయపడ్డారు.(చిన్నవాళ్లం... భారత్‌పై ప్రతీకారం తీర్చుకోలేం!) -
చిన్నవాళ్లం... భారత్‌పై ప్రతీకారం తీర్చుకోలేం!
కౌలాలంపూర్: భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేంత పెద్దవాళ్లం కాదని మలేషియా ప్రధాని మహతీర్ మహ్మద్(94) వ్యాఖ్యానించారు. వాణిజ్యపరంగా భారత్‌తో ఏర్పడ్డ విభేదాలను అధిగమించి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గత కొన్ని నెలలుగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను మలేషియా ప్రధాని మహతీర్ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబరులో ఐక్యరాజ్యసమితి 74వ సర్వసభ్య సమావేశంలో మహతీర్ మాట్లాడుతూ.. కశ్మీర్‌ను ఆక్రమిత ప్రాంతంగా పేర్కొన్నారు. కశ్మీరీ లోయ దురాక్రమణకు గురైందని.. ఇది చాలా తప్పుడు చర్య అని భారత్‌పై విమర్శలు గుప్పించారు. అదే విధంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో మలేషియా పామాయిల్‌ను కొనుగోలు చేయకూడదని భారత్‌కు చెందిన ప్రముఖ ఆయిల్ ప్రాసెసర్ సంస్థలు నిర్ణయించాయి. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్ దిగుమతిదారుగా ఉన్న భారత్ తాజా నిర్ణయంతో మలేషియా తీవ్రంగా నష్టపోతోంది. దాదాపు 10 శాతం మేర ఎగుమతులు పడిపోయాయి. ఇప్పటికిప్పుడు నూతన దిగుమతిదారు దొరక్కపోవడంతో మలేషియా వాణిజ్యపరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో లంగ్వావీలో సోమవారం విలేకరులతో మాట్లాడిన మహతీర్... తమ పామాయిల్ ఉత్పత్తులను భారత్ బాయ్‌కాట్ చేసినంత మాత్రాన తాము ప్రతీకార చర్యలకు దిగబోమన్నారు. ‘మేం చాలా చిన్నవాళ్లం. ప్రతీకారం తీర్చుకోలేం. అయితే దీనిని అధిగమించడం లేదా ఇందుకు ప్రత్యామ్నాయాన్ని కనుగొనే మార్గాలు అన్వేషిస్తున్నాం’ అని పేర్కొన్నారు. (ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మలేషియా ప్రధాని) అదే విధంగా సీఏఏ ప్రవేశపెట్టడం సరైంది కాదని మరోసారి అభిప్రాయపడ్డారు. ఇక పరారీలో ఉన్న వివాదాస్పద మత ప్రబోధకుడు జాకీర్ నాయక్ అప్పగింత విషయంలోనూ భారత్- మలేషియాల మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్న విషయం తెలిసిందే. భారత్‌లో మనీలాండరింగ్‌కు పాల్పడటం, విద్వేషపూరిత ప్రసంగాలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జాకీర్ నాయక్.. ప్రస్తుతం మలేషియాలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో జాకీర్‌ను అప్పగించాల్సిందిగా భారత్ ఎన్నిసార్లు విఙ్ఞప్తి చేసినప్పటికీ మలేషియా ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. స్వేచ్ఛాయుత వాతావరణంలో జాకీర్‌ను విచారిస్తామని భారత్ చెప్పినప్పటికీ... అతడికి చెడు తలపెట్టే అవకాశాలు ఉన్నాయన్న మహతీర్.. జాకీర్‌ను భద్రంగా చూసుకుంటూ.. అతడికి ఎటువంటి హాని తలపెట్టని దేశం (భారత్ కాకుండా)ఉందని భావించినపుడు మాత్రమే అతడిని తమ దేశం నుంచి బయటకు పంపించగలమని పేర్కొన్నారు. -
ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మలేషియా ప్రధాని
కౌలాలంపూర్ : జమ్మూ కశ్మీర్‌పై తాను చేసిన వ్యాఖ్యలను కట్టుబడి ఉన్నానని మలేషియా ప్రధాని మహతీర్ మహ్మద్ స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి సూచించిన పరిష్కారాలను అగ్రరాజ్యం అమెరికా సహా భారత్, పాకిస్తాన్ వంటి ప్రతీ దేశం స్వాగతించి తీరాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఐరాస 74వ సర్వసభ్య సమావేశం సందర్భంగా న్యూయార్క్‌లో ప్రసంగించిన మహతీర్.. కశ్మీర్‌ను ఆక్రమిత ప్రాంతంగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఐరాస తీర్మానాలకు వ్యతిరేకంగా కశ్మీరీ లోయ దురాక్రమణకు గురైందని.. ఇది చాలా తప్పుడు చర్య అని పేర్కొన్నారు. శాంతియుత చర్చలతోనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. అయితే జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో మహతీర్ ఈ వ్యాఖ్యలు చేయడంపై భారత విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ మాట్లాడుతూ... మలేషియా ప్రధాని మహతీర్ వ్యాఖ్యలు విచారకరమని పేర్కొన్నారు. భారత్- మలేషియాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని.. అయితే ఆ దేశ ప్రధాని మాత్రం అసత్యాలను అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించడం బాగాలేదని విమర్శించారు. ఇక ఈ విషయంపై మంగళవారం స్పందించిన మహతీర్.. కశ్మీర్‌పై తన మనసులో ఉన్న కచ్చితమైన అభిప్రాయాన్ని వెల్లడించానని.. దానిని ఎవరికోసమో మార్చుకునేది లేదని స్పష్టం చేశారు. ‘ఇతర దేశాలతో ఉన్న దౌత్యపరమైన సంబంధాలను కాపాడుకోవడంతో పాటు అక్కడి ప్రజలతో కూడా స్నేహంగా ఉండాలని మేము భావిస్తున్నాం. మాది వాణిజ్య అనుకూల దేశం. అందుకే అతిపెద్ద మార్కెట్ల కోసం అన్వేషిస్తాం. అంతమాత్రాన ప్రజల పక్షాన మాట్లాడేందుకు మేము వెనకడుగువేయం. అయినా నిజాలు మాట్లాడినపుడు కొంత మంది స్వాగతిస్తారు. మరికొంత మంది వ్యతిరేకిస్తారు’ అని పేర్కొన్నారు. అదే విధంగా కశ్మీర్‌పై తన వ్యాఖ్యల నేపథ్యంలో మలేషియా పామ్ ఆయిల్‌ను కొనుగోలు చేయకూడదని ముంబైకి చెందిన ప్రముఖ ఆయిల్ ప్రాసెసర్ సంస్థలు నిర్ణయించిన విషయంపై కూడా ఆయన స్పందించారు. ప్రస్తుతానికి తాను ఈ విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ దృష్టికి తీసుకువెళ్లాలని భావించడం లేదని తెలిపారు. -
మలేసియాలో మరణశిక్ష రద్దు
కౌలాలంపూర్: మలేసియా ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. తీవ్రమైన నేరాలకు పాల్పడిన దోషులకు విధించే మరణశిక్షను త్వరలోనే రద్దు చేస్తామని ప్రకటించింది. ప్రధాని మహతీర్ మొహమ్మద్ అధ్యక్షతన బుధవారం నాడిక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మలేసియా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో త్వరలో మరణశిక్ష అమలు కానున్న 1,200 మందికి పైగా ఖైదీలకు ఊరట లభించినట్లయింది. సాధారణంగా హత్య, డ్రగ్స్ అక్రమరవాణా, దేశద్రోహం, ఉగ్రదాడులు, కిడ్నాప్ వంటి ఘటనల్లో దోషులుగా తేలినవారికి మలేసియాలో ఇప్పటివరకూ మరణదండన విధిస్తున్నారు. తాజా నిర్ణయంపై మలేసియా న్యాయశాఖ మంత్రి ల్యూ వుయ్ కియాంగ్ మాట్లాడుతూ.. మరణదండనకు సంబంధిం చి సవరించిన బిల్లును వచ్చే సోమవారం పార్లమెంటులో ప్రవేశపెడతామని తెలిపారు. అవినీతి రహిత పాలన అందిస్తామనీ, మరణశిక్షను రద్దు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని వెల్లడించారు. కాగా, మలేసియా ప్రభుత్వ నిర్ణయాన్ని అమ్నెస్టీ ఇంటర్నేషనల్, మానవహక్కుల సంస్థ‘లాయర్స్ ఫర్ లిబర్టీ’ స్వాగతించాయి. ఈ సందర్భంగా కొత్త చట్టంలో ఎలాంటి మినహాయింపులు లేకుండా అన్ని నేరాలకు మరణశిక్షను రద్దు చేయాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యదర్శి కుమీ నైదూ విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 142 దేశాలు మరణదండనను తిరస్కరించాయని వెల్లడించారు. భారత్, సింగపూర్, చైనా, ఇండోనేసియా, థాయ్‌లాండ్, వియత్నాం దేశాలు ఇంకా మరణశిక్షను అమలు చేస్తున్నాయన్నారు. -
మలేసియా ప్రధానితో జకీర్ నాయక్ భేటీ
కౌలాలంపూర్: భారత్‌కు చెందిన వివాదాస్పద మత ప్రబోధకుడు జకీర్‌నాయక్ మలేసియా ప్రధాని మహతీర్ మహ్మద్‌ను కలిశారు. ఉగ్ర కార్యకలాపాలు, మనీ లాండరింగ్‌కు సంబంధించిన కేసులు ఉండటంతో ఆయన్ను అప్పగించాలని మలేసియా ప్రభుత్వాన్ని భారత్ కోరుతోంది. అయితే, ఆయన్ను పంపబోమని ప్రధాని మహతీర్ శనివారం ప్రకటించడం తెల్సిందే. ప్రధాని మహతీర్‌తో జకీర్ సంక్షిప్త భేటీలో ఏం మాట్లాడారన్న విషయం వెల్లడికాలేదు. అయితే, మలేసియా ప్రభుత్వ నిర్ణయాన్ని అధికార పార్టీ సమర్ధించిందని మీడియా తెలిపింది. జకీర్‌నాయక్‌కు మలేసియాలో శాశ్వత నివాస హోదా ఉంది. దాని ప్రకారం అక్కడి చట్టాలను ఉల్లంఘించనంత వరకు నివాసం ఉండే హక్కు ఉంటుంది. భారత్ కోర్టుల్లో జకీర్‌పై నేరారోపణలు నమోదయితేనే రెండు దేశాల మధ్య ఉన్న నేరస్తుల మార్పిడి ఒప్పందం అమల్లోకి వస్తుందని ఆయన లాయర్ షహరుద్దీన్ తెలిపారు. జకీర్ విషయంలో ప్రధాని‡ నిర్ణయం సరైందేనని అధికార పార్టీ తెలిపింది. -
‘జకీర్‌ను అప్పగించే ప్రసక్తే లేదు’
పుత్రజయ, మలేషియా : వివాదాస్పద మత ప్రచారకుడు జకీర్ నాయక్ అప్పగింత విషయంలో భారత్‌కు మలేషియా షాకిచ్చింది. జకీర్‌ను భారత్‌కు అప్పగించే ప్రసక్తే లేదని మలేషియా ప్రధాని మహతీర్ మహ్మద్ శుక్రవారం స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘జకీర్ మలేషియాలో శాశ్వత నివాస హోదా కలిగి ఉన్నారు. ఆయన వల్ల మాకు సమస్యలు రానంత వరకు దేశం విడిచి వెళ్లాలంటూ ఒత్తిడి చేయలేమని’ మహతీర్ వ్యాఖ్యానించారు. కాగా మలేషియాలో నివాసముంటున్న జకీర్‌ను అప్పగించాల్సిందిగా భారత విదేశాంగ శాఖ మలేషియా ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. అప్పగింత ఒప్పందంలో భాగంగా గత జనవరిలో భారత్ చేసిన అభ్యర్థనకు మలేషియా సానుకూలంగా స్పందిస్తుందంటూ విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మలేషియా ప్రధానే స్వయంగా ఈ విషయమై స్పష్టతన్విడం గమనార్హం. అవన్నీ అవాస్తవాలు.. ఆర్థిక ఉల్లంఘనలతో పాటు మత విద్వేషాలకు పాల్పడుతున్నారని జకీర్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చార్జ్‌షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా కొద్ది రోజులుగా.. జకీర్ భారత్‌కు తిరిగి వస్తున్నారంటూ వస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు. ‘భారత ప్రభుత్వం, న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగినప్పుడే భారత్‌కు తిరిగి వస్తాను. అంతవరకు ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా నన్ను ఏ రకంగానూ ఇబ్బంది పెట్టలేరంటూ’ జకీర్ పేర్కొన్నారు. -
మలేషియాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన
-
మలేసియా ప్రధానిగా మహతీర్ బిన్ మహమ్మద్