సమస్య కొలిక్కి.. నామ్ మృతదేహం అప్పగింత
కౌలాలంపూర్: ఎట్టకేలకు ఉత్తర కొరియా మలేషియాల మధ్య తాజాగా తలెత్తిన సమస్య తీరింది. ఇరు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చి దాదాపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పరిచిన సమస్యను తీర్చుకున్నాయి. మలేషియా ఎయిర్‌పోర్ట్‌లో హత్యకు గురైన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరుడు కిమ్ జాంగ్ నామ్ మృతదేహాన్ని తిరిగి ఉత్తర కొరియాకు మలేషియా అప్పగించింది. దీంతో ఉత్తర కొరియాలో బందీలుగా ఉన్న తొమ్మిదిమంది మలేషియా రాయభార కార్యాలయానికి చెందినవారు తిరిగి కౌలాలంపూర్‌లో అడుగుపెట్టారు.
ప్రస్తుతం నామ్ మృతదేహాం కొరియా చేరుకునే క్రమంలో ఉందని, తమ దేశ పౌరులు సురక్షితంగా తిరిగొచ్చారని మలేషియా అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. నామ్ హత్య తర్వాత ఇరు దేశాల మధ్య కీలక పరిణామాలు సంభవించాయి. ఇరు దేశాల రాయబారులను బహిష్కరించుకోవడంతోపాటు తమ దేశాల పౌరులు పరస్పర దేశాల్లోకి అడుగుపెట్టనివ్వకుండా ట్రావెల్ బ్యాన్ కూడా విధించుకున్నాయి.
అయితే ఎట్టేకేలకు మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ ఉత్తర కొరియాతో చర్చలు జరిపిన తర్వాత ఇరు దేశాల మధ్య విధించుకున్న బ్యాన్ ను ఎత్తేశారు. కిమ్ జాంగ్ నామ్ మృతదేహాన్ని పంపించారు. ఉత్తరకొరియాలోని మలేషియా రాయబార కార్యాలయానికి చెందిన ఆరుగురు కుటుంబ సభ్యులు, ఓ చిన్నారి, ముగ్గురు చిన్నారులు తిరిగి శుక్రవారం ఉదయం కౌలాలంపూర్‌లో అడుగుపెట్టడంతో కొంత ఉద్వేగభరితమైన క్షణాలు ఆవిష్కృతమయ్యాయి.