
న్యూజెర్సీ: 2019.. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన డేనీ గియానోటో అనే వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబట్టాడు. అయితే తాను చుక్క మద్యం కూడా తాగలేదంటూ పోలీసులతో తీవ్రంగా వాదించాడు. అతని మాటలో ఎంత నిజముందో చూద్దామని పోలీసులు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేస్తే అతడు పూటుగా తాగాడనే చూపించింది. మూడు సార్లు పరీక్షించినా తాగాడనే రుజువైంది. ఇంకేముందీ.. కళ్ల ముందు సాక్ష్యం కనిపించడంతో అతనేం చెప్పినా పట్టించుకోకుండా అరెస్ట్ చేశారు. కట్ చేస్తే.. అతను నిజంగానే తాగలేదని తేలింది. అరెస్ట్ అయిన నెల తర్వాత ఆసుపత్రికి వెళ్లగా అక్కడ గమ్మత్తైన విషయం తెలిసింది. డేనీ కడుపులో మద్యం తయారవుతోందని వైద్యులు కనుగొన్నారు. దీన్ని ఆటో బ్రీవరీ సిండ్రోమ్ (ఏబీఎస్) అంటారు. (ఈ బుడ్డోడు నిజంగా సూపర్)
అంటే అతని పొట్టలోని కార్బోహైడ్రేట్లు వాటంతట అవే ఆల్కహాల్‌గా మారతాయి. ముఖ్యంగా కేకులు, బ్రెడ్, పిజ్జాలు వంటి ఆహారాన్ని తీసుకున్నప్పుడు పొట్టలో ఆల్కహాల్ స్థాయి మరింత పెరుగుతుంది. దీంతో అతను వాటిని మానేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు బదులుగా మాంసం, చేపలు, ఆకు కూరలు తీసుకుంటున్నాడు. ఈ విషయం గురించి డేనీ మాట్లాడుతూ.. "నన్ను పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు షాక్ అయ్యాను. నేను మందు తాగలేదని ఎంత మొత్తుకున్నా వారు వినిపించుకోలేదు. తాగకపోయినా తాగిన నేరం కింద అరెస్టు చేస్తుండటంతో పిచ్చి పట్టినట్లైంది" అని పేర్కొన్నాడు. ఇప్పటికీ తాను మద్యం సేవించలేదంటే ఎవరూ నమ్మరని, పైగా జోక్ చేస్తున్నా అనుకుంటారని వాపోయాడు. (10 బీర్లు తాగి పడుకున్నాడు, ఆ తరువాత..)