మార్స్ అప్పుడు జీవానుకూలం!
లండన్: ఇప్పుడు చల్లగా, పొడి వాతావరణం కలిగి ఉన్న అంగారక గ్రహం ఒకప్పుడు ఇలా ఉండేది కాదని, వెచ్చటి వాతావరణంతో జీవనానికి అనుకూలంగా ఉండేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అరుణ గ్రహం ఉపరితలంలోని పురాతన ప్రాంతంలో గుర్తించిన నదీ అవశేషాలను విశ్లేషించిన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు ఈ మేరకు వెల్లడించారు. 'అరేబియా టెర్రా'గా పిలవబడే అంగారక గ్రహం ఉత్తర ప్రాంతంలో పరిశోధకులు ఇటీవల పురాతన నదీ అవశేషాలను గుర్తించారు. వీటిపై జరిపిన పరిశోధనల్లో మార్స్ 400 కోట్ల సంవత్సరాల క్రితం జీవానుకూలంగా ఉండేదని పరిశోధనకు నేతృత్వం వహించిన జోయల్ డెవిస్ వెల్లడించారు.
అరుణ గ్రహంపై జరుపుతున్న పరిశోధనల్లో గతంలోనే శాస్త్రవేత్తలు నీటి ప్రవాహాలకు సంబంధించిన ఆనవాళ్లను గుర్తించారు. అయితే.. ఇటీవల నాసా స్పేస్ క్రాఫ్ట్.. మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్(ఎమ్ఆర్ఓ) అందించిన సమాచారాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు అరేబియా టెర్రా ప్రాంతంలో పురాతన నదీ అవశేషాలను కనుగొన్నారు.