అంగారకుడిపై జలసిరి!
వాషింగ్టన్: అంగారక గ్రహం ఉపరితలంలోని మట్టిలో నీరు సమృద్ధిగా ఉందట. ఆ గ్రహంపై ఎక్కడైనా సరే గుప్పెడు మట్టిని తవ్వి దానిని బాగా వేడిచేస్తే.. నీటిని ఆవిరి రూపంలో పట్టుకోవచ్చట. క్యూరియాసిటీ శోధక నౌక (రోవర్) ఇటీవలి విశ్లేషణలో ఈ విషయం వెల్లడైనట్లు ఈ మేరకు నాసా శాస్త్రవేత్తలను ఉటంకిస్తూ.. శుక్రవారం నాటి సంచికలో ‘సైన్స్’ జర్నల్ ఓ కథనం ప్రచురించింది. అరుణగ్రహంపై ఒకప్పుడు జీవ ం ఉనికికి అనుకూలమైన వాతావరణం ఉండేదా? అన్న కోణంలో అన్వేషణ కోసం నాసా పంపిన క్యూరియాసిటీ రోవర్ గతేడాది ఆగస్టులో ఆ గ్రహంపై గేల్‌క్రేటర్‌లో దిగింది. అక్కడి రాక్‌నెస్ట్ ప్రాంతంలో సేకరించిన మట్టిని తన శాంపిల్ అనలైసిస్ ఎట్ మార్స్ (శామ్) పరికరంతో క్యూరియాసిటీ గత జూలైలో పరీక్షించింది.
దుమ్ము, రేణువులతోకూడిన మట్టి శాంపిల్‌ను శామ్ పరికరంలో 835 డిగ్రీ సెల్షియస్‌కు వేడిచేయగా.. 2 శాతం వరకూ నీటి అణువులు విడుదలయ్యాయని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. మట్టి నుంచి వెలువడిన నీటిలో హైడ్రోజన్, కార్బన్, సీవోటూల శాతాన్ని కూడా పరిశీలించినట్లు తెలిపారు. ఆ మట్టిలో క్లోరిన్, సల్ఫర్ మూలకాలనూ శామ్‌లోని గ్యాస్ క్రొమొటొగ్రాఫ్, మాస్ స్పెక్ట్రోమీటర్ పరికరాలు గుర్తించాయన్నారు. మార్స్ మట్టి లో రెండు శాతం నీరు ఉండటమంటే నీరు సమృద్ధిగా ఉన్నట్లేనని వారు అంటున్నారు. కాగా ఇంతవరకూ నీటి ప్రవాహం, ఖనిజాల ఆనవాళ్లను గుర్తించిన క్యూరియాసిటీ జీవం ఉనికికి సంకేతమైన కర్బన పదార్థాలను మాత్రం ఇంకా గుర్తించలేదు. ప్రస్తుతం తన తుది గమ్యం అయిన షార్ప్‌నెస్ట్ పర్వతం దిశగా ప్రయాణిస్తున్న రోవర్ మరికొన్నిసార్లు మట్టి, శిలలను పరిశీలించనుంది. కాగా.. మార్స్‌పై శాశ్వత నివాసం కోసం 2022 నాటికి మనుషులను పంపాలని ‘మార్స్ వన్’ అనే కంపెనీ ప్రయత్నాలు ప్రారంభించిన సంగ తి తెలిసిందే. అక్కడ నీరు సమృద్ధిగా ఉందని తేలడంతో అక్కడ మానవ నివాసానికి ప్రధాన వనరు సమకూరినట్లేనని శాస్త్రవేత్తలు అంటున్నారు.