కాబూల్‌లో నరమేధం
♦ 30 మంది మృతి, 320 మందికి గాయాలు
♦ దాడికి బాధ్యులమని ప్రకటించుకున్న తాలిబాన్
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ప్రధాన భద్రతా కార్యాలయం వద్ద మంగళవారం సంభవించిన ట్రక్కు బాంబు పేలుడులో 30 మంది మరణించగా, 320 మందికి పైగా గాయపడ్డారు. పేలుడుకు తామే బాధ్యులమంటూ తాలిబాన్ ప్రకటించుకుంది. పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని ఆత్మాహుతి దళ సభ్యుడు ప్రభుత్వ కార్యాలయాల పార్కింగ్ వద్ద పేల్చేసుకున్నాడంటూ కాబూల్ పోలీస్ చీఫ్ అబ్దుల్ రెహమాన్ రహిమి విలేకరులకు చెప్పారు. మరణించిన వారిలో ఎక్కువమంది సామాన్య ప్రజలేనని ఆయన తెలిపారు. బాంబు దాడి అనంతరం ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకోవడంతో పాటు కిలోమీటర్ల దూరంలోని భవనాల అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి.
దాడి జరిగిన ప్రాంతంలో అఫ్గాన్ భద్రతా సంస్థలతో పాటు అమెరికా రాయబార కార్యాలయం, ఇతర ముఖ్య సంస్థలున్నాయి. కొద్ది దూరంలోనే రక్షణ శాఖ కార్యాలయం, అధ్యక్ష భవనం ఉంది. ఈ ఏడాది పోరాటాన్ని ప్రారంభించామంటూ గతవారం తాలిబాన్ ప్రకటించాక అఫ్గాన్‌లో జరిగిన తొలి దాడి ఇది. బాంబు పేలుడు అనంతరం భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. పేలుడును యుద్ధ నేరంగా పరిగణిస్తున్నామని,ఉగ్రవాదుల్ని పట్టుకుని తీరతామని దేశ అంతర్గత మంత్రి సిదిఖ్కీ ప్రకటించారు. గాయపడ్డవారిలో చాలామంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ఉగ్రవాదులు నిఘా విభాగ కార్యాలయమైన నేషనల్ డెరైక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీలోకి ప్రవేశించారంటూ తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ప్రకటించగా... ప్రభుత్వం దాన్ని ఖండించింది. ప్రభుత్వంలోని ప్రముఖులకు రక్షణ కల్పించే భద్రతా కార్యాలయం లక్ష్యంగానే ఈ దాడిచేశారంటూ తెలిపింది. దాడిని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు.