9.0 తీవ్రతతో భూకంపం రావొచ్చు!
ఢాకా: బంగ్లాదేశ్‌లో త్వరలో భారీ భూకంపానికి అవకాశం ఉందని, దీని ప్రభావం తూర్పు భారతంలోని పట్టణ ప్రాంతాలపై ఉంటుందని అధ్యయనంలో తేలింది. గంగ, బ్రహ్మపుత్ర నదుల పరిధిలో భూమి లోపలి రెండు ఫలకాలపై ఒత్తిడి పెరిగిపోవడమే దీనికి కారణమట. భూకంపం వస్తే తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.2 కన్నా ఎక్కువగా ఉండొచ్చని, 9.0కీ చేరొచ్చని.. 14 కోట్ల మందిపై ప్రభావం చూపుతుందని కొలంబియా యూనివర్సిటీకు చెందిన భూ భౌతిక శాస్త్రవేత్త మైఖెల్ స్టెక్లర్ తెలిపారు.
భూమి కంపించడం వల్లే ఇంతమందిపై ప్రభావం పడుతుందని, సునామీలు వస్తే మరింత మందిపై ప్రభావం పడే అవకాశముందన్నారు. సముద్రంలో భూకంపనాలు సంభవించే అవకాశం లేకపోలేదన్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలు నేచుర్ జియోసైన్స్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.
2004లో హిందూ మహాసముద్రంలో సంభవించిన భూకంపం, సునామీ 2,30,000 మందిని బలితీసుకుంది. 2011లో జపాన్ లో వచ్చిన విలయంతో 20 వేల మందిపైగా మృతి చెందారు. గతేడాది నేపాల్ లో భూకంపం సంభవించడంతో 9 వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిశోధన వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి.