ప్రపంచంలో ఆడవాళ్లతో పోలిస్తే మగవాళ్లే ఎక్కువ ఒంటరితనంతో బాధ పడుతున్నారు. ఇటీవల జరిపిన ఓ సర్వేలో బ్రిటన్ విషయంలో కూడా ఇదే రుజువైంది. అక్కడ ప్రతి ఐదుగురిలో ఒక పురుషుడు ఒంటరితనంతో బాధ పడుతున్నారు. సన్నిహిత మిత్రులు ఒక్కరు కూడా లేరని 18 శాతం మంది, మంచి మిత్రులే లేరని 32 శాతం మంది చెప్పగా, 12 శాతం మహిళలు సన్నిహిత మిత్రులు లేరని, 24 శాతం మంది మహిళలు మంచి మిత్రులు లేరని ‘యూగౌ’ జరిపిన సర్వేలో తెలిపారు.
పిల్లల స్కూళ్లకు వెళ్లినప్పుడో, వారి కోసం క్రీడా క్లబ్బులు, మైదానాలకు వెళ్లినప్పుడు ఇతర పిల్లల తల్లులు తమకు ఎక్కువగా స్నేహితులు అవుతున్నారని తేలింది. ఈ విషయంలో తండ్రులకు ఎక్కువగా స్నేహితులు కావడం లేదు. కారణం వారు తరుచుగా పిల్లల కోసం స్కూళ్లకుగానీ స్పోర్ట్స్ క్లబ్బులకుగానీ వెళ్లకపోవడం. మగవాళ్లకు ఎక్కువగా ఆఫీసుల్లోనే స్నేహితులు అవుతున్నారు. అందుకనే వారిలో ఎక్కువ మంది పదవీ విరమణ తర్వాత ఒంటరితనంతో బాధపడాల్సి వస్తోంది.
సమాజంలో పురుషులకన్నా మహిళలనే సోషల్ నెట్‌వర్క్ ఎక్కువగా ఉంటుందని, వారు జీవితాంతం కొత్తవారిని స్నేహం చేసుకోవడానికి ప్రయత్నిస్తారని, అదే మగవాళ్లలో లేదని, వారితో మనకేం పనిలే అనుకోవడం అందుకు కారణమని బ్రిటన్‌లో ఒంటరితనాన్ని రూపుమాపేందుకు కృషి చేస్తున్న పరిశోధనా సంస్థ డైరెక్టర్ రాబిన్ హెవింగ్స్ విశ్లేషించారు. పైగా మహిళలు సొంత విషయాలు మిత్రులు, కుటుంబాలతో పంచుకోవడానికి ఎక్కువ చొరవ చూపుతారని, అదే మగవాడు ఒంటరితనంతో బాధ పడుతున్న విషయాన్ని మరొకరితో పంచుకోవడానికి ఇష్టపడరని, అలా పంచుకోవడం ఆత్మ న్యూన్యతా భావంగా భావించడమేనని హెమింగ్స్ వివరించారు.
కొత్త వారిని పరిచయం చేసుకోవాలనే ఉత్సాహం కూడా మగవాళ్లలో తక్కువ. అలాంటి ఉత్సాహం ఉన్న వాళ్లు కేవలం 18 శాతం మాత్రమేనని తేలింది. ఒంటరితనంతో బాధపడడం వల్ల జీవితం మీద విరక్తి పుడుతుంది. అది పెరిగితే బతుకు భారం అనిపిస్తుంది. ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. కొంతమంది ఆ తీవ్రమైన చర్యకు కూడా పాల్పడతారు. అందుకని పురుషుల్లో ఒంటరితనం పోవాలంటే పాత మిత్రులతో స్నేహాన్ని పునరుద్ధరించుకోవాలి.
అందుకు నేడు సోషల్ మీడియా ఎంతగానో తోడ్పడుతుంది. ఉదయం పూట వాకింగ్ అలవాటు చేసుకొని అలా వచ్చేవారితో స్నేహం చేసుకోవాలి. లేదా పెంపుడు కుక్కలను అలా తిప్పడానికి తీసుకెళ్లినప్పుడు తోటి వాళ్లతో స్నేహం చేయాలి. వ్యాయామం లేదా ఇతర కాలక్షేప క్లబ్బుల్లో సభ్యత్వం తీసుకోవడం ద్వారా స్నేహాన్ని పెంచుకోవచ్చు. స్వచ్ఛంద సంస్థల్లో లేదా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలి. అన్నింటికన్నా ముందు ఇరుగు, పొరుగు వారితో స్నేహం చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment