వాషింగ్టన్ : నా భర్త పౌరసత్వం గురించి అవాస్తవాలు ప్రచారం చేసి నా కుటుంబానికి భద్రత లేకుండా చేశాడు. ఈ విషయంలో ట్రంప్‌ను ఎన్నటికీ క్షమించలేను అంటూ అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బర్తర్’ థియరి పేరుతో తన కుటుంబం పట్ల ట్రంప్ ప్రవర్తన గురించి మిచెల్ తన ‘బికమింగ్’ పుస్తకంలో పలు విషయాల్ని ప్రస్తావించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పౌరసత్వాన్ని ప్రశ్నిస్తూ 2011 సమయంలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘బర్తర్’ థియరిని ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఒబామాను ఉద్దేశిస్తూ ‘ఎందుకు నీ బర్త్ సర్టిఫికేట్‌ను చూపించడం లేదం’టూ ట్రంప్ ప్రశ్నించారు. ఒకవేళ నిజంగా మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ లేకపోతే అది అమెరికా రాజకీయాల్లోనే పెను సంచలనం అంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఊరుకోక ఈ అంశానికి మతం రంగు పులిమే ప్రయత్నం కూడా చేశారు ట్రంప్. ‘ఒబామా ముస్లిం అనుకుంటాను. అందుకే తన బర్త్ సర్టిఫికేట్‌ని చూపించడం లేదం’టూ ఆరోపించారు. ఈ విషయాలన్నింటి గురించి మిచెల్ తన ‘బికమింగ్’ పుస్తకంలో గుర్తు చేసుకున్నారు.
ట్రంప్ లాంటి జాత్యహంకార వ్యక్తిని తానేప్పుడు చూడలేదన్నారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యల వల్ల తన కుటుంబ భద్రతకు ముప్పు వాటిల్లిందని మిచెల్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ట్రంప్ ప్రచారం చేసిన ‘బర్తర్’ థియరీ చూడ్డానికి చాలా హాస్యాస్పదంగా ఉన్నా ఇది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే ఎవరైనా మతి స్థిమితం సరిగా లేని వ్యక్తి ట్రంప్ మాటలను విశ్వసించి మా మీద ద్వేషం పెంచుకుని.. ఏ చాకో.. గన్నోతీసుకుని మా కుటుంబం మీద దాడి చేయడానికి వస్తే మా పరిస్థితి ఏంట’ని ప్రశ్నించారు. అందుకే ఈ విషయంలో తాను ఎప్పటికి ట్రంప్‌ని క్షమించలేనని తెలిపారు. మూడు భాగాలుగా వస్తోన్న బికమింగ్ పుస్తకాన్ని నవంబర్ 14న విడుదల చేయనున్నారు
Comments
Please login to add a commentAdd a comment