బక్కెట్లకొద్దీ డబ్బు దొరికింది!
ఫ్లోరిడాలో పోలీసులకు దిమ్మతిరిగే దృశ్యం కనిపించింది. ఓ ఇంట్లో భద్రంగా దాచిన 24 బక్కెట్లలో కోట్ల కొద్దీ డబ్బు కనిపించడంతో షాక్ అయ్యారు. అక్రమ వ్యాపారం నిర్వహించగా వచ్చిన డబ్బును మియామీ ప్రాంతంలోని ఓ వ్యాపారి ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టిన వార్త.. ఇప్పుడక్కడ పెద్ద సంచలనంగా మారింది.
అటకమీద ఎవ్వరికీ కనిపించకుండా దాచిన బక్కెట్లనిండా డబ్బుతోపాటు, కొన్ని డ్రగ్స్, ఓ గన్ కనిపించడంతో పోలీసులు అవాక్కయ్యారు. అమెరికా ఫ్లోరిడాలోని మియామీలోని ఓ ఇంట్లో తన అక్రమ వ్యాపారంతో సంపాదించిన డబ్బును సదరు వ్యాపారి బక్కెట్లలో భద్రంగా దాచుకున్నాడు. ఇంటి అటకమీద 24 బక్కెట్లలో దాచిపెట్టిన 163 కోట్ల రూపాయలను (సుమారు 20 మిలియన్ డాలర్లు) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సొమ్ముతోపాటు, అత్యంత ఖరీదైన తుపాకీ, కొన్ని డ్రగ్స్ ను స్వాధీనం చేసుకొన్న మియామీ పోలీసులు.. వ్యాపారిని సైతం అదుపులోకి తీసుకున్నారు. 44 ఏళ్ళ లూయిస్ హెర్నాండెజ్ గాంజలెజ్, ఆయన సోదరి 32 ఏళ్ళ సల్మా గాంజలెజ్ లను అక్రమ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న కేసులో అరెస్టు చేశారు.
గార్డెన్ సామాన్లు అమ్మే బిజినెస్ నిర్వహిస్తున్న నిందితులు, అక్రమంగా మాదక ద్రవ్యాల వ్యాపారం కూడ చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు.. వారి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇంట్లోని అటకపై భద్రంగా దాచిపెట్టిన బక్కెట్ల కొద్దీ డబ్బును, డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడంతో పాటు వారిద్దరిపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సెర్చ్ వారెంట్ తో నిందితుల ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు అటకపై ఉన్న బక్కెట్లు చూసి షాకయ్యారు. వాటితోపాటు ఎనబాలిక్ స్టెరాయిడ్లు, టీఈసీ-9 పిస్టల్ కనిపించడంతో వారి అనుమానాలు నిజమయ్యాయి. వెంటనే అలర్టయిన పోలీసులు... నిందితులను అదుపులోకి తీసుకొని అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టారు. ఇంత భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి అని చెప్తున్నారు.