ఈ 'మిరాకిల్'.. వెరీవెరీ రేర్!
అమ్మమ్మ, అమ్మ, మనవరాలు.. ఈ అనుబంధమే ఎంతో మధురమైనది. ఈ అనుబంధానికి ఓ 'అద్భుతం' తోడయితే అది 'మిరాకిల్' జననం అవుతుంది. ఇంతకువిషయమేమిటంటే 'మిరాకిల్' అనే పండంటి పాప జనవరి 18న జన్మించింది. ఆ రోజు ఎంత స్పెషల్ అంటే అదే రోజున 'మిరాకిల్' తల్లి ఎయిమీ హెర్నాండో, అమ్మమ్మ కూడా జన్మించారు. అంటే ఆ కుటుంబంలో మూడు తరాలకు చెందిన ఆడపిల్లలు ఒకేరోజున ఈ భూమి మీద అడుగుపెట్టారన్నమాట.
జనవరి 18న హెర్నాండో 33వ పుట్టినరోజు. అదే రోజున ఆమె తల్లి 56వ పడిలో అడుగుపెట్టింది. అలాంటి తరుణంలో గర్భవతిగా ఉన్న హెర్నాండోకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. హెర్నాండోలో ఒకటే ఎక్సైట్‌మెంట్. 'నేను లేబర్ రూమ్‌లోకి వెళ్లగానే.. డాక్టర్‌కు ఒకటే విషయం చెప్పాను అర్ధరాత్రి లోపు ప్రసవం జరుగాలని..' అని హెర్నాండో ఇప్పుడు గర్వంగా చెప్తోంది. జనవరి 18న సాయంత్రం భూమి మీద అడుగుపెట్టిన ఆ పండంటిపాపకు 'మిరాకిల్ జాయ్' అని పెట్టారు. 'మా పుట్టినరోజులకు ఇంతకన్నా గొప్ప బహుమతి ఏముంటుంది' అంటూ ఆమె సంతోషం వ్యక్తం చేస్తోంది.
'లేబర్‌రూమ్‌లో పురిటినొప్పుల పడుతున్నడు.. ఓ మై గాడ్.. ఈ అద్భుతం నిజంగానే జరుగుతున్నదా అని ఎక్సైట్ అయ్యాను' అని తెలిపింది. అదృష్టం జన్మదినం విషయంలోనే కాదు వారి బరువు విషయంలోనూ కలిసి వచ్చినట్టు కనిపిస్తోంది. 'మా అమ్మ పుట్టినప్పుడు తను ఆరు పౌండ్ల 10 ఔన్సులు బరువు ఉందట. నేను పుట్టినప్పుడు నా బరువు ఆరు పౌండ్ల 9 ఔన్సులు. ఇప్పుడు మిరాకిల్ ఆరు పౌండ్ల 8 ఔన్సులు ఉంది. ఇది కూడా ఎంతో కూల్ విషయం కదా' అంటోంది ఆమె. సాధారణంగా మూడు తరాల వారు ఒకే తేదీన జన్మించడం అత్యంత అరుదని, అది 1,33,225 మందిలో ఒకరికి జరిగే అవకాశం ఉంటుందని గణాంక శాస్త్రవేత్త కీత్ డెవ్లిన్ వివరించారు. దాదాపు ఏడేళ్ల ఇబ్బందుల తర్వాత గర్భవతి అయిన హెర్నాండో తన నాలుగో సంతానమైన పాపకు 'మిరాకిల్' అని పెట్టడం అనివిధాల సమంజసం అని భావిస్తున్నట్టు చెప్తోంది.