
'ఎయిర్ ఏషియా విమానం కూలిపోయి ఉండొచ్చు'
జకర్తా: కొత్త ఏడాది ముందు మరో ఘోర విషాదకర సంఘటన! అదృశ్యమైన ఎయిర్ ఏషియా ఏషియా విమానం కూలిపోయి ఉండొచ్చని ఇండోనేసియా ఉపాధ్యక్షుడు జుసఫ్ ఖల్లా చెప్పారు. ఆదివారం ఉదయం అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానం గాలింపు చర్యలకు ఆయనే నేతృత్వం వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జుసఫ్ ఖల్లా మాట్లాడుతూ.. విమానం కూలిపోయి ఉండొచ్చని, అయితే ఎక్కడ కూలిపోయిందన్న విషయం గురించి తన వద్ద సమాచారం లేదని చెప్పారు. విమానం కోసం చేపట్టిన గాలింపు చర్యలు ఈ రోజు సాయంత్రం ఆపివేశారు. సోమవారం ఉదయం నుంచి మళ్లీ మొదలుపెడతారు.
ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానం-క్యూజెడ్8501 గగన తలం నుంచి అదృశ్యమైంది. 162 మందితో సురబయా నుంచి సింగపూర్ బయలుదేరిన విమానంతో కొద్ది సేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయి. ఆదివారం ఉదయం 7.24 గంటలకు(స్థానిక కాలమానం) జకర్తా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంబంధాలు తెగిపోయాయి. ఇదిలావుండగా, భారత్కు వెళ్లే విమాన సర్వీసులు షెడ్యూల్ ప్రకారం వెళతాయని ఎయిర్ ఏషియా యాజమాన్యం పేర్కొంది. విమానం అదృశ్యమైన ఘటన, భారత్కు వెళ్లే విమాన సర్వీసులపై ప్రభావం చూపబోదని చెప్పారు.