
మోదీ ‘మేధో’ మథనం
ప్రపంచ పరిణామాలపై చర్చ
- పురాతన భారత కళాఖండాలను తిరిగి అప్పగించిన అమెరికా
- కల్పనాచావ్లాకు మోదీ నివాళులు..
వాషింగ్టన్: మూడు రోజుల అమెరికా పర్యటన కోసం సోమవారం వాషింగ్టన్ చేరుకున్న మోదీ ఆ దేశానికి చెందిన పలు ప్రముఖ మేధో సంస్థల(థింక్ ట్యాంక్స్)తో భేటీ అయ్యారు. ప్రపంచ పరిణామాలను, సవాళ్లను ఆయా సంస్థలు ఎలా చూస్తున్నాయి.. ప్రపంచానికి భారత్, అమెరికాలు కలసి ఏం చేయగలవని భావిస్తున్నాయి అనేది తెలుసుకునేందుకు మోదీ ఈ భేటీలో పాల్గొన్నారు. బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూట్, కౌన్సిల్ ఫర్ ఫారిన్ రిలేషన్స్, సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్, అట్లాంటిక్ కౌన్సిల్, సెంటర్ ఫర్ నేషనల్ ఇంటరెస్ట్, కార్నెగీ ఎండోమెంట్, ది యూఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ‘అగ్రగామి మేధో సంస్థలతో అద్భుతమైన సమావేశం జరిగింది’ అని మోదీ భేటీ తర్వాత ట్వీట్ చేశారు. ప్రపంచ అంశాలకు సంబంధించి స్వల్ప, దీర్ఘకాలికకసరత్తుపై చర్చించినట్లు తెలిపారు.
అంతకుముందు..ఆర్లింగ్టన్ నేషనల్ సిమెటరీలో.. టోంబ్ ఆఫ్ ది అన్‌నోన్ సోల్జర్స్ (గుర్తుతెలియని సైనికుల సమాధి) వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. భారతీయ అమెరికన్ వ్యోమగామి కల్పనా చావ్లా సమాధి వద్దా మోదీ నివాళులర్పించారు. స్పేస్ షటిల్ కొలంబియా మెమోరియల్ వద్ద (స్మారక కేంద్రం) కల్పన భర్త, కుటుంబ సభ్యులతో పాటు.. నాసా అధికారులు, భారతీయ అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె తండ్రి తదితరులను కలసి ముచ్చటించారు. మోదీతో పాటు అమెరికా రక్షణ మంత్రి ఆష్టన్ కార్టర్ కూడా ఉన్నారు.
పురాతన కళాఖండాలు భారత్‌కు అప్పగింత
భారత్ నుంచి దొంగిలించిన 200 పురాతన కళాఖండాలను అమెరికా భారత్‌కు తిరిగి అప్పగించింది. వీటి విలులవ పది కోట్ల డాలర్లు బ్లెయిర్ హౌస్‌లో కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ఈ సాంస్కృతిక సంపద భారత్ - అమెరికాల ద్వైపాక్షిక సంబంధాన్ని బలోపేతం చేసే శక్తి అని అభివర్ణించారు. వీటిని తిరిగి అప్పగించినందుకు.. ఒబామాకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కళాఖండాల్లో చాలా వరకూ ‘అమెరికాలో ఆపరేషన్ హిడెన్ ఐడల్’ పేరుతో చేపట్టిన సోదాల్లో స్వాధీనం చేసుకున్నవని ఆ దేశ అధికారులు తెలిపారు. వీటిని స్మగుల్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యూయార్క్ ‘ఆర్ట్ ఆఫ్ ది పాస్ట్ గ్యాలరీ’ యజమాని సుభాష్‌కపూర్ భారత్‌లో విచారణ ఎదుర్కొంటూ జైలులో ఉన్నాడు.
ముస్లింలకు మోదీ రంజాన్ శుభాకాంక్షలు
రంజాన్ ఆరంభాన్ని పురస్కరించుకుని ముస్లింలకు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్రమైన నెల సోదర బంధాన్ని, సమాజంలో సామరస్య స్ఫూర్తిని బలోపేతం చేస్తుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.