మనీలా: భారత్–అమెరికా సంబంధాలు ద్వైపాక్షిక బంధాల పరిధిని మించి మరింత విస్తృతంగా, బలంగా ఎదిగేందుకు అవకాశం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక మార్పుల దృష్ట్యా ఆసియా భవిష్యత్తు కోసం భారత్–అమెరికాలు సంయుక్తంగా పనిచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరుగుతున్న ఆసియాన్ సదస్సు సందర్భంగా మోదీ, ట్రంప్ ప్రత్యేకంగా 45 నిమిషాల సేపు భేటీ అయ్యారు. విస్తృతాంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. అమెరికా అంచనాలను భారత్ అందుకుంటుందని మోదీ పేర్కొన్నారు. ట్రంప్ ఇటీవలి పర్యటనల్లో భారత్ గురించి గొప్పగా చెప్పడంపై కృతజ్ఞతలు తెలిపారు.
ప్రపంచ అంచనాలను అందుకుంటాం
‘ఇరుదేశాల మధ్య సహకారం ద్వైపాక్షిక బంధాలకన్నా ఎక్కువగా ఎదిగేందుకు అవకాశం ఉంది. ప్రపంచం, ఆసియా భవిష్యత్తు కోసం మేం కలిసి పనిచేస్తాం. ఇప్పటికే చాలా అంశాల్లో సంయుక్తంగా ముందుకెళ్తున్నాం’ అని ట్రంప్‌తో భేటీ తర్వాత మోదీ అన్నారు. ‘ట్రంప్ ఎక్కడికెళ్లినా, ఏమాత్రం అవకాశం దొరికినా భారత్ గురించే గొప్పగా చెబుతున్నారు. భారత్ నుంచి ప్రపంచం, అమెరికా కోరుకుంటున్న దాన్ని నెరవేరుస్తామని నేను భరోసా ఇస్తున్నాను. ఇప్పటికే ఈ దిశగా భారత్ పనిచేస్తోంది. ఈ పనిని భవిష్యత్తులోనూ కొనసాగిస్తాం’ అని ప్రధాని వెల్లడించారు. అటు ట్రంప్ కూడా మోదీ తనకు మంచి స్నేహితుడని పేర్కొన్నారు.
పెట్టుబడులతో భారత్‌కు రండి
అంతకుముందు, ఆసియాన్ బిజినెస్ ఫోరం బృందంతో మోదీ సమావేశమయ్యారు. భారత ఆర్థిక సంస్కరణలు శరవేగంగా జరుగుతున్నాయని తద్వారా వాణిజ్యం, పెట్టుబడులకు సువర్ణావకాశం ఉందని సమావేశంలో ప్రధాని అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం చాలా రంగాల్లో నిబంధనలను సరళీకృతం చేశామన్నారు. ‘భారత్‌లో సంస్కరణలు చాలా వేగంగా జరుగుతున్నాయి. సులభమైన, ప్రభావవంతమైన, పారదర్శకమైన పాలన అందించేందుకు మేం అహోరాత్రులు శ్రమిస్తున్నాం. 90 శాతానికిపైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రంగాల్లో ఆటోమేటిక్‌గా అనుమతులు వచ్చేస్తాయి’ అని మోదీ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ‘గ్యాస్’కే పరిమితమైంది
ఫిలిప్పీన్స్ పర్యటనలో భాగంగా అక్కడి భారతీయులను మోదీ కలిశారు. తమ ప్రభుత్వం మూడేళ్లలో 3కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్లు ఇచ్చిందన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారమంతా గ్యాస్ సిలిండర్ల చుట్టే తిరిగింద న్నారు. సదస్సు ప్రారంభోత్సవంలో రామా యణం ఆధారంగా ప్రదర్శించిన ఓ కార్యక్రమం ప్రశంసలు అందుకుంది. తర్వాత ‘మహావీర్ ఫిలిప్పీన్ ఫౌండేషన్’కు మోదీ వెళ్లారు. వికలాంగులకు జైపూర్ ఫుట్‌ను అందజేస్తున్న ఈ సంస్థను మోదీ ప్రశంసించారు.
ఫిలిప్పీన్స్‌కు భారత వంగడాలు
ఫిలిప్పీన్స్‌లోని మనీలా సమీపంలోని అంతర్జాతీయ వరి పరిశోధనాసంస్థ (ఐఆర్‌ఆర్‌ఐ)ను ప్రధాని సందర్శించారు. ఈ సందర్భంగా ఐఆర్‌ఆర్‌ఐ జీన్ బ్యాంక్‌కు రెండు భారత వరి వంగడాలను అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆకలి తీర్చే లక్ష్యంతో ఐఆర్‌ఆర్‌ఐ పనిచేస్తోంది. ప్రకృతి విపత్తులను, వరదలను తట్టుకునేలా రూ పొందించిన వరి వంగడాలను శాస్త్రవేత్తలు ప్రధానికి వివరించారు. 18 రోజుల పాటు నీటిలో మునిగినా హెక్టారుకు 1–3 టన్ను ల వరి ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు.
.
Comments
Please login to add a commentAdd a comment