26న మోదీ–ట్రంప్ భేటీ
హెచ్1బీ వీసాతోపాటు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ జూన్ 25, 26 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారు. జూన్ 26న శ్వేతసౌధంలో వీరిరువురూ భేటీకానున్నారు. పారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతూ భారత్ సహాపలుదేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మోదీ పర్యటన ఆసక్తికరంగా మారింది. హెచ్1బీ వీసా నిబంధనలు, ఇతర కీలకాంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. జూన్ 25న ప్రారంభమయ్యే ఈ పర్యటన ద్వారా భారత్–అమెరికా దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కానున్నాయని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.
‘మోదీ ట్రంప్‌తో జూన్ 26న అధికారిక చర్చలు జరుపుతారు. ఇరుదేశాల పరస్పర ప్రయోజనాలు, బహుముఖ వ్యూహాత్మక భాగస్వామ్య అంశాలు ఈ భేటీలో చర్చి స్తారు’ అని ప్రకటనలో తెలిపింది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు (జనవరి 20న) తీసుకున్నాక మోదీతో తొలిసారిగా సమావేశం కానుండటంతో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది. మూడుసార్లు ఇరువురు నేతలు హాట్‌లైన్‌లో మాట్లాడుకున్నారు.
హెచ్1బీ వీసాపై అమెరికాలోని భారతీయుల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో దీనిపై భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ట్రంప్‌తో భేటీ సందర్భంగా హెచ్1బీ వీసా విషయంపై మోదీ చర్చిస్తారంటూ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇటీవల చెప్పారు. దక్షిణాసియాలో వ్యూహా త్మక ప్రయోజనాలు, ఉగ్రవాదంపై సంయుక్తపోరు, రక్షణ సంబంధాలు, వాణిజ్య సహకారం, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంతోపాటుగా పలు అంతర్జాతీయ అంశాలనూ ప్రధాని లేవనెత్తే వీలుంది.